బండి సంజయ్ రాజీనామాకు రెడీ అయ్యాడా?

భారతీయ జనతా పార్టీ తెలంగాణ విభాగానికి ఇప్పటిదాకా అధ్యక్షులుగా చేసిన వాళ్లలో ఎవరూ లేనంతగా చాలా తక్కువ సమయంలో వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు బండి సంజయ్. గత ఏడాది కరీం నగర్ ఎంపీగా సంచలన విజయం సాధించిన సంజయ్‌లోని దూకుడు చూసి అధిష్టానం ఆయన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ని చేసింది. సంజయ్ ఆ దూకుడుతోనే పార్టీకి ఊపు తెచ్చిన మాట వాస్తవం.

కానీ అనేక వివాదాస్పద వ్యాఖ్యలు, అవగాహన లేని మాటలతో అదే స్థాయిలో అన్ పాపులర్ కూడా అయ్యారు సంజయ్. ముఖ్యంగా ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘చలాన్ల రద్దు’ సహా పలు కామెంట్లతో బండి సంజయ్ విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి రంగంలోకి దిగి ఆయన్ని అదుపు చేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. టికెట్ల కేటాయింపులో బండి సంజయ్‌కు ప్రాధాన్యం కూడా తగ్గించేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సంజయ్ అలక పాన్పు ఎక్కినట్లు వార్తలొస్తున్నాయి.

ఓవైపు ఎమ్మెల్యే రాజా సింగ్ ఏమో బండి సంజయ్ తాను చెప్పిన వాళ్లకు టికెట్ ఇవ్వలేదంటూ ఆరోపణలు చేస్తుంటే.. మరోవైపు తాను చెప్పిన వాళ్లకు టికెట్లు ఇవ్వకపోవడంతో సంజయ్ హర్టయినట్లు సమాచారం. కరీంనగర్ ఎంపీ అయిన సంజయ్‌కు హైదరాబాద్ వ్యవహారాలు ఏం తెలుస్తుందంటూ ఆయన్ని టికెట్ల ఎంపికలో పక్కన పెట్టారట. కిషన్ రెడ్డి, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ కలిసి మెజారిటీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేశారట.

దీనికి తోడు ఇటీవలి వివాదాస్పద కామెంట్ల నేపథ్యంలో సంజయ్‌కు కిషన్ రెడ్డి క్లాస్ తీసుకున్నారని.. చివరగా ఇద్దరూ కలిసి పాల్గొన్న సమావేశంలో ఎడమొహం పెడమొహంగా ఉండటానికి ఇదే కారణమని.. ఒక దశలో కిషన్ రెడ్డి వ్యవహార శైలితో మనస్తాపానికి గురైన సంజయ్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని అన్నారని.. ఐతే ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో ఇలా చేస్తే, విభేదాలు బయటపడితే పార్టీకి నష్టం జరుగుతుందని ఆయనకు సర్దిచెప్పినట్లు సమాచారం.