తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి బుధవారం అనంతపురంలో తొలి విజయోత్సవ సభ “సూపర్ సిక్స్..సూపర్ హిట్”ను నిర్వహించింది. కూటమి పాలన మొదలై 15 నెలలు గడిచిన నేపథ్యంలో తమ పాలన ఎలా సాగిందన్న విషయాన్ని జనానికి చెప్పేందుకు, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు ఎలా సాగుతోందన్న విషయాలను వివరించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీలు ఉమ్మడిగా ఈ సభను నిర్వహించాయి. ఈ సభ గ్రాండ్ సక్సెస్ గా ముగిసిందని చెప్పక తప్పదు. అంతేకాకుండా మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం ప్రారంభం అవుతుందని చెప్పిన కూటమి సరిగ్గా అదే సమయానికి సభను ప్రారంభించి నిర్దేశిత సమయంలోనే ముగించింది.
ఈ సభ కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ అద్యక్షుడు మాధవ్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్దేశిత సమయానికే సభా స్థలికి చేరుకున్నారు. అమరావతి నుంచి వేర్వేరుగా అనంతపురం బయలుదేరిన బాబు, పవన్… 2.40 గంటల కంతా సభా స్థలికి చేరుకుని సభా వేదికపై ఆసీనులయ్యారు. సరిగ్గా 3 గంటల సమయానికంతా నేతల ప్రసంగాలు మొదలయ్యాయి. తొలుత బీజేపీ నేతలు మాట్లాడాక… పవన్ కల్యాణ్ స్వల్ప ప్రసంగం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగంతో సభ 5 గంటలలోపే ముగిసింది.
ఇక సభ టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో మారుమోగిపోయింది. ప్రత్యేకించి టీడీపీ శ్రేణులను నిలువరించడానికి సాధ్యమే కాలేదు. వాస్తవానికి సభకు 3.5 లక్షల మందిని తరలించాలని కూటమి నేతలు భావించగా… సబా స్థలిలో అంతకుమించి అన్నట్లు 5 లక్షల దాకా జనం వచ్చినట్లు సమాచారం. చంద్రబాబు ప్రసంగం సాంతం సభను హోరెత్తించింది. బాబు ప్రసంగిస్తుంటే… సభకు హాజరైన జనసందోహం ఉద్వేగంతో ఊగిపోయిందంటే అతిశయోక్తి కాదేమో. బాబు ప్రసంగానికి ఓ రేంజిలో జనం నుంచి అప్లాజ్ రావడమే కాకుండా సభా స్థలిని ఉర్రూతలూగించింది. కేటమి సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి బాబు చెబుతున్నప్పుడు ఏ రేంజిలో జనం ఉప్పొంగారో…విపక్ష నేత జగన్ ను బాబు విమర్శిస్తున్నప్పుడు అంతకుమించి కేకలు ఈలలు వేశారు.
అనంతపురం జిల్లా అది కూడా రాష్ట్రానికి మారుమూల జిల్లా… అక్కడ విజయోత్సవ సభ పెడితే సక్సెస్ అవుతామా? అన్న అనుమానం ఏమాత్రం లేకుండా కూటమి పార్టీల నేతలు అడుగు ముందుకు వేశారు. ఇటీవలే కడప జిల్లాలో పులివెందుల సహా రెండు జడ్పీటీసీలను టీడీపీ గెలుచుకున్న ఉత్సాహం అనంతపురం సభను దిగ్విజయం చేసిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వైసీపీకి, జగన్ కు గట్టి పట్టున్న రాయలసీమలో టీడీపీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా… అనంతపురం సభ మూడో అడుగుగా గ్రాండ్ సక్సెస్ గా ముగిసిందని చెప్పక తప్పదు.

Gulte Telugu Telugu Political and Movie News Updates