అనంతపురం జిల్లాలో ఈ రోజు సూపర్ సిక్స్-సూపర్ హిట్ బహిరంగ సభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమిలోని మూడు పార్టీల కీలక నేతలు కలిసి ఒకే వేదికపై కనిపించారు. ఈ సభకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ వేదికపై ప్రసంగించిన పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పుట్టపర్తి నారాయణాచార్యులు, భళ్లారి రాఘవ రావు, గజ్జల మల్లారెడ్డి వంటి మహానుభావులు పుట్టిన నేల రాయలసీమ అని అన్నారు. రుతువులెన్నయినా రాయలసీమకు ఒకటే రుతువు అది కరువు రుతువు అని..కాలాలెన్నయినా రాయలసీమకు ఒకటే కాలం అది ఎండా కాలం అని చెప్పారు. రాయల సీమను రతనాల సీమగా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజా శ్రేయస్సు కోసం వేల కోట్లు ఖర్చు పెట్టి సూపర్ సిక్స్ అమలు చేస్తున్నామని పవన్ అన్నారు. యువత, మహిళల భవిష్యత్తు కోసం ఈ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.
యద్భావం తద్భవతి అని…ప్రజలు తమను నమ్మి ఓటు వేశారని…అందుకే వారు కోరుకున్నట్లు పాలన అందిస్తున్నామని అన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ సిక్స్ హామీలు నెరవేరుస్తున్నామని పవన్ అన్నారు. ఏపీలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. పర్యాటక రంగంలో కూడా పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని తెలిపారు. ఒకే రోజు రికార్డు స్థాయిలో 10 వేలకు పైగా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించామని అన్నారు. ప్రధాని మోదీ సహకారం, సీఎం చంద్రబాబు నాయకత్వంలో అడవితల్లి బాట కార్యక్రమం ద్వారా 1005 కోట్ల వ్యయంతో 625 గ్రామాలు కలుపుతూ 1069 కి.మీ రోడ్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు. గిరిజనులకు డోలీ మోతలు లేకుండా చూస్తామని హామీనిచ్చాచు.
Gulte Telugu Telugu Political and Movie News Updates