ప్రస్తుతం అంతర్గత సంక్షోభంతో అల్లాడుతున్న భారత్ పొరుగు దేశం నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికి ఏపీ మంత్రి నారా లోకేష్ భరోసా కల్పించారు. తాజాగా అక్కడ చిక్కుకున్న వారితో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఖాట్మాండులోని పశుపతినాథ్ టెంపుల్ సమీపంలోని రాయల్ కుసుమ్ హోటల్ లో విశాఖకు చెందిన 81 మంది తెలుగువారు తలదాచుకున్నారు. ఈ విషయం తెలియగానే మంత్రి నారా లోకేష్ వారితో మాట్లాడారు.
తొలిసారి అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రానికి వచ్చిన లోకేష్.. తొలుత అధికారులతో మాట్లాడారు. నేపా ల్‌లో చిక్కుకున్న తెలుగు వారిని రక్షించేందుకు ప్రయత్నించాలని ఆదేశించారు. అవసరమైతే.. అధికా రుల బృందాన్ని అక్కడకు పంపించేందుకు సీఎం చంద్రబాబుతో చర్చిస్తానని చెప్పారు. అమరావతిలో ప్రత్యేకంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. నేపాల్‌లో చిక్కుకున్న వారి వివరాలను సేకరించి.. వారి బంధు వులకు అందించాలని సూచించారు.
అనంతరం.. నేపాల్‌లో చిక్కుకున్న విశాఖకు చెందిన రోజారాణి అనే మహిళతో మంత్రి లోకేష్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. “అధైర్య పడొద్దు.. మిమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత మాది” అని భరోసా ఇచ్చారు. భారత విదేశాంగశాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ప్రతి రెండుగంటలకోసారి నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికి ప్రభుత్వం అందుబాటులో ఉంటుందన్నారు. ఆందోళన చెందవద్దని తెలిపారు.
ఖాట్మాండు నుంచి విశాఖకు ప్రత్యేక విమానం ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. అవసరమైతే.. ప్రత్యేక అధికారుల బృందాన్ని ఖట్మాండుకు పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. దీనిపై సీఎంతో తాను చర్చిస్తానన్నారు. అయితే.. అప్పటి వరకు అక్కడి వారికి ధైర్యం చెప్పాలని అధికారులను ఆదేశించారు. ఈ వ్యవహారంపై కేంద్రంతోనూ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates