చిన్న మార్పులతో పెద్ద‌నేత‌గా నారా లోకేష్!

నారా లోకేష్. ఇప్పుడు దేశ వ్యాప్త‌ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న పేరు. వాస్తవానికి ఆయ‌న‌ మంత్రి. గతంలో ‘యువ‌గ‌ళం’ పాదయాత్ర ద్వారా సుదీర్ఘ దూరం ప్రయాణించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయినప్పటికీ, ఇప్పుడు మరో కోణంలో నారా లోకేష్ పేరు జాతీయ స్థాయిలో వినిపిస్తోంది. ఇక‌, ఆయన వ్యవహార శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా జాతీయ స్థాయిలో చంద్రబాబు తర్వాత స్థానాన్ని సంపాదించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ముఖ్యంగా ‘ఆటిట్యూడ్’ లో మార్పు రావడం ద్వారా జాతీయస్థాయి నేతగా ఎదిగేందుకు నారా లోకేష్ కు చాలా పెద్ద అవకాశం కనిపిస్తోంది అన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. ఇప్పటివరకు చంద్రబాబు జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలుగుతున్నారు. భవిష్యత్తులో ఏపీ నుంచి ఆ తరహా నాయకత్వం నారా లోకేష్ ద్వారా భర్తీ అవుతుందన్నది వారి మాట. ఏడాదిన్నర కాలంలో ఇప్పటికీ దాదాపు ఐదు -ఆరుసార్లు ఢిల్లీలో పర్యటించడం, ప్రధానమంత్రిని మూడుసార్లు కలుసుకోవడం, కేంద్ర మంత్రులతో తరచుగా టచ్ లో ఉండడం అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చే పథకాలను తీసుకురావడం వంటివి లోకేష్ డైరీలో క‌నిపించాయి.

అదేవిధంగా ఏపీకి సంబంధించిన సమస్యలపై కేంద్రంతో చర్చించడం ద్వారా నారా లోకేష్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. అయితే, భవిష్యత్తులో మరింత దూకుడుగా వ్యవహరించాలంటే నారా లోకేష్ మరింతగా పుంజుకోవాల్సిన అవసరం ఉందని, చిన్న చిన్న మార్పులతో ఆయన ‘పెద్ద నేత’గా ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నది వారు చెబుతున్న విషయం. ముఖ్యంగా జాతీయస్థాయిలో కావాల్సింది ఉత్తరాది ప్రజలను ఆకర్షించేందుకు జాతీయ స్థాయి సమస్యలను కూడా స్పృశించాల్సిన అవసరం ఉంది.

అదేవిధంగా ఎక్కువమంది పై ప్రభావం చూపించే అంశాలను ప్రాతిపదికగా చేసుకొని జాతీయ స్థాయిలో మీడియా సమావేశాలు పెట్టడం.. ఢిల్లీలోనే మీడియాతో మాట్లాడటం.. వంటివి చేయడం ద్వారా నారా లోకేష్ పెద్ద నేతగా ఎదిగేందుకు అవ‌కాశం ఉంది. ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో కీలక నాయకుడిగా అతి త్వరలోనే ఎదిగేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ఆ మార్పులు దిశగా ఆయన అడుగులు వేస్తారా లేదా అనేది చూడాలి.