వైసీపీ అధినేత జగన్.. సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “చంద్రబాబుకు ఆ ధైర్యం లేదు” అంటూ వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలో ఆయన సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం.. సాయంత్రం స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను తెలుసుకున్నారు.పలువురి నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు. అదేవిధంగా పలువురు చిన్నారులకు.. కొద్దిపాటి ఆర్థిక సాయం అందించారు. అనంతరం.. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పలు విషయాలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఒంటిమిట్ట, పులివెందులలో ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఎలా ఓడిపోయిందన్న విషయంపై సుదీర్ఘంగా నాయకులతో చర్చించారు. పార్టీకి బలం లేక ఓడిపోలేదని.. పోలీసులు ఓట్లువేసేవారిని బూతులకు రాకుండా అడ్డుకున్నారని.. ఈ సందర్భంగా నాయకులు చెప్పారు. కిలో మీటర్ల మేరకు.. పోలింగ్ బూత్‌లను మార్చేశారని.. దీంతో చాలా మంది ఇంటికే పరిమితం అయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా జగన్ స్పందిస్తూ.. చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించే ధైర్యం కూడా ఆయనకు లేదని విమర్శించారు.
అంతేకాదు.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగి ఉంటే.. వైసీపీ అభ్యర్థులు గెలిచి ఉండేవారని జగన్ చెప్పారు. అన్ని విషయాల్లోనూ ప్రజలను మోసం చేస్తున్నారని కూటమి పాలకులపై జగన్ విమర్శలు గుప్పించారు. ప్రతి విషయాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. “గతంలో మన పాలనలో ఇలా ఎప్పుడూ చేయలేదు. ప్రతి విషయాన్నీ రాజకీయం చేయాలని మనకు తెలియదు. అలా చేసి ఉంటే ఇప్పుడు వారు గెలిచేవారా?” అని జగన్ ప్రశ్నించారు. అదేసమయంలో పార్టీ నాయకులకు ఆయన భరోసా కల్పించారు. ఇక, నుంచి ప్రతి రెండు మాసాలకు ఒకసారి జిల్లాకు వస్తానని.. రాజకీయంగా బలోపేతం కావాలని సూచించారు.
కూటమి నేతలపై పదునైన వ్యూహంతో విమర్శలు పెంచాలని తన పార్టీ కార్యకర్తలు, నాయకులకు జగన్ సూచించారు. ఎవరూ ఆవేదన చెందాల్సిన అవసరం లేదన్న జగన్.. ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యం ఇస్తామన్నారు. కాగా.. ఈ సమయంలో నియోజకవర్గానికి చెందిన కొందరు మాజీ వలంటీర్లు.. జగన్‌ను కలిసే ప్రయత్నం చేశారు. అయితే.. సిబ్బంది అడ్డగించారు. ఈ విషయం తెలిసిన జగన్.. వారిని లోపలికి అనుమతించాలని ఆదేశించడంతో కొందరిని పంపించారు. ఈ సమయంలో వారు తమ ఆర్థిక సమస్యలు చెప్పుకొచ్చారు. అయితే.. జగన్ మాత్రం.. “మీరంతా సక్రంగా పనిచేసి ఉంటే.. మన ప్రభుత్వం ఉండేది కదా!” అని వ్యాఖ్యానించారు. అనంతరం వారి నుంచి వినతులు తీసుకుని సాగనంపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates