‘పుష్ప-2’ సినిమాలో ‘రప్పా-రప్పా నరకుతా!’ అనే డైలాగు.. సినిమాకు సంబంధించి ఎంత ఫేమస్ అయిందో తెలియదు కానీ.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు.. ఈ డైలాగును అందిపుచ్చుకున్న తర్వాత.. రప్పా-రప్పా డైలాగుకు హద్దులు లేకుండా పోయాయి. తెలంగాణ నుంచి మహారాష్ట్ర(ఇటీవల ఓ పార్టీ నాయకులు రప్పా రప్పా వ్యాఖ్యలు చేశారు)వరకు రప్పా-రప్పా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రత్యర్థుల రాజకీయాలను ప్రస్తావిస్తూ.. వారిని ఉద్దేశించి ఈ హెచ్చరికలు చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ రప్పా-రప్పా సంస్కృతి వినాయకచవితి వేడుకలకు కూడా పాకిపోయింది. గణపతి ఉత్సవాల్లోనూ, విగ్రహాలకు వెనుక భాగంలోనూ కూడా.. రప్పా-రప్పా.. డైలాగులు దర్శనమిస్తున్నాయి. దీంతో పూజలు చేసేందుకు వస్తున్న వారు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా కడప జిల్లా(జగన్ సొంత జిల్లా)లోని ఎర్రగుంట్లలో నిర్వహించిన గణపతి ఉత్సవాల ముగింపు సందర్భంగా.. ఊరేగింపు నిర్వహించారు. ఈ క్రమంలో విగ్రహానికి వెనుక భాగంలో రప్పా – రప్పా డైలాగులు కనిపించాయి.
అంతేకాదు.. రప్పా-రప్పా డైలాగుతోపాటు.. ‘వైసీపీ’ సహా.. గొడ్డలి మార్కులను రెడ్ కలర్‌తో పెద్ద ఎత్తున కనిపించేలా వేశారు. ఇక, నిమజ్జనంలో పాల్గొన్న యువత కూడా.. “వైసీపీ రప్పా-రప్పా..” అంటూ నినాదాలు చేశారు. వాస్తవానికి ఇలాంటి నిమజ్జన కార్యక్రమాల్లో గణపతి బప్పా.. అంటూ నినాదాలు హోరెత్తుతాయి. కానీ, తొలిసారి వైసీపీ రప్పా.. రప్పా.. నినాదాలు హోరెత్తడంతో సాధారణ భక్తులు భీతిల్లారు. ఈ వ్యహారం సోషల్ మీడియాను కుదిపేయడంతో పోలీసులు దృష్టి పెట్టారు.
ఎర్రగుంట్లలో మండపం నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారా? లేక.. ఎవరైనా తెలియని వ్యక్తి వచ్చి.. విగ్రహానికి వెనుక భాగంలో ఇలా రప్పా రప్పా డైలాగులు రాశారా? గొడ్డలి గుర్తు వేశారా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. అదేవిధంగా వైసీపీ నాయకుల ప్రమేయంపైనా దృష్టి పెట్టారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates