టార్గెట్ డీజీపీ: సాక్షిపై కేసులు!

సాక్షి.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌కు చెందిన మీడియా అనే విష‌యం తెలిసిందే. ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాలు రెండూ కూడా జ‌గ‌న్‌వే. అయితే.. ప్ర‌స్తుతం ఈ మీడియాను ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి న‌డుపుతున్నారు. ఇదిలావుంటే.. ఏపీలో అధికారం కోల్పోయిన త‌ర్వాత‌.. స‌ర్కారును తీవ్ర‌స్థాయిలో టార్గెట్ చేస్తున్న జ‌గ‌న్‌, ఆయ‌న మీడియా ప‌దే ప‌దే పోలీసుల‌పైనా వ్యాఖ్యలు చేస్తున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో పోలీసులపై జ‌గ‌న్ తీవ్ర వ్యాఖ్య‌లే చేశారు. టీడీపీకి మ‌ద్ద‌తుగా ఉంటూ..వైసీపీ నేత‌ల‌పై కేసులు పెట్టేవారిని ఊరుకునేది లేద‌న్నారు.

వారు ఉద్యోగాలు వ‌దిలి వెళ్లిపోయినా.. ఎక్క‌డున్నా తీసుకువ‌చ్చి శిక్షించి తీరుతామ‌ని చెప్పారు. అంతేకాదు.. బ‌ట్ట‌లూడదీస్తామని.. త‌మ నాయ‌కుల‌కు సెల్యూట్ కొట్టిస్తామ‌ని .. ఇలా ప‌లు సంద‌ర్భాల్లో జ‌గ‌న్ చెప్పారు. అయితే.. త‌మ‌ను రాజ‌కీయాల్లోకి లాగొద్దంటూ.. పోలీసులు కూడా ప‌దేప‌దే విన్న‌వించుకున్నారు. ఇదిలావుంటే.. తాజాగా సాక్షిలో కీల‌క వార్త వ‌చ్చింది. పోలీసు శాఖ‌లో ప‌ద‌వుల‌ను, ప‌దోన్న‌తుల‌ను కూడా అమ్ముకుంటున్నార‌న్న‌ది ఈ క‌థ‌నం సారాంశం. ‘పైసామే ప్ర‌మోష‌న్‌’ పేరుతో నేరుగా రాష్ట్ర డీజీపీని ‘బిగ్ బాస్‌’గా పేర్కొంటూ క‌థ‌నాన్నిరాసుకొచ్చారు.

“కేవ‌లం రాజ్య‌ల‌క్ష్మి ఉంటే స‌రిపోదు.. ధ‌న‌ల‌క్ష్మి ప్ర‌స‌న్నం కూడా ఉండాలి” అని బిగ్ బాస్ వ్యాఖ్యానిస్తున్న‌ట్టు క‌థ‌నంలో సాక్షి రాసింది. అంతేకాదు.. “మాకేమీ ప‌ద‌వులు ఉచితంగా రాలేద‌ని.. ప్ర‌భుత్వ పెద్ద‌లు ఏదైనా చెబుతారు. మాకేమీ ఊరికేనే ఇవ్వ‌లేదు” అని వ్యాఖ్యానించిన‌ట్టుగా రాసింది. ఇది హోం శాఖ‌లో పెనుక‌ల‌క‌లం రేపింది. ప్ర‌స్తుతం డీఎస్పీలుగా ఉన్న‌వారిని ఏఎస్పీలుగా ప్ర‌మోట్ చేయాల్సి ఉంది. ఇది కొన్నాళ్లుగా పెండింగులోనే ఉంది. దీంతో ఈ ప‌దోన్న‌తుల‌ను ఇలా పెండింగులో పెట్ట‌డానికి ధ‌న‌ల‌క్ష్మే కార‌ణ‌మంటూ.. క‌థ‌నంలో ప్ర‌త్యేకంగా పేర్కొన్నారు.

దీనిపై ఆగ్ర‌హించిన రాష్ట్ర పోలీసు సంక్షేమ సంఘం అధ్య‌క్షుడు జ‌న‌కుల శ్రీనివాస‌రావు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీనిని త‌ప్పుడు క‌థ‌నంగా పేర్కొన్న ఆయ‌న‌.. సాక్షి ఎడిట‌ర్ ధ‌నుంజ‌య్‌రెడ్డి, క్రైమ్ రిపోర్ట‌ర్ స‌హా.. ఇత‌ర సిబ్బందిపైనా తాడేప‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఇలా.. సాక్షిపై కేసు న‌మోదు కావ‌డం ఫ‌స్ట్ టైమ్‌. గ‌తంలో అనేక విమ‌ర్శ‌లు చేసినా.. కేవ‌లం ప్రెస్‌మీట్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయిన పోలీసులు.. తాజాగా డీజీపీని టార్గెట్ చేయ‌డంతో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు.. నోటీసులు ఇవ్వ‌నున్న‌ట్టు పేర్కొన్నారు.