బీజేపీని ఇరికించేసిన రేవంత్ రెడ్డి.. విష‌యం ఇదీ!

రాజ‌కీయాలు.. రాజ‌కీయాలే. ఏం చేసినా.. దాని వెనుక మ‌ర్మం.. ఖ‌చ్చితంగా ఉంటుంది. తాజాగా కాళేశ్వ‌రం ప్రాజెక్టు అవినీతి, అక్ర‌మాల‌పై.. నియ‌మించిన జ‌స్టిస్ పీసీ ఘోష్ క‌మిష‌న్ రిపోర్టు అంశం.. రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. తెలంగాణ‌లోని ఏ కూడ‌లిలో చూసినా.. ఏ బ‌స్తీలో క‌నిపించినా.. ఇదే చ‌ర్చ‌. ఏ ఇద్ద‌రు క‌లిసినా.. ‘కేసీఆర్ స‌ర్‌’ గురించే చ‌ర్చ‌. ఇక‌, ఈ క‌మిష‌న్ రిపోర్టుపై.. ఆదివారం సాయంత్రం 4 గంట‌ల నుంచి అర్ధ‌రాత్రి 12.12 గంట‌ల వ‌రకు కూడా అసెంబ్లీలో సుదీర్ఘ చ‌ర్చ సాగింది.

అనంత‌రం.. ఈ కేసును సీబీఐకి అప్ప‌గిస్తున్న‌ట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. దీనిలో జ‌రిగిన అవినీతి.. అక్ర‌మాలు వెలుగు చూడ‌డంతోపాటు.. సొమ్మును రాబ‌ట్టాల‌న్న‌ది త‌మ ధ్యేయంగా రేవంత్ చెప్పారు. అందుకే.. అంతిమంగా.. తాము సీబీఐకి ఇవ్వాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. దీనిపై అభ్యంత‌రాలు ఉంటే తెలుసుకుంటామ‌ని.. పేర్కొంటూ.. ఎంఐఎం స‌హా మిత్ర‌ప‌క్షం సీపీఐని కూడా రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. అంద‌రూ మౌనంగా ఉండ‌డంతో సీబీఐకి అప్ప‌గిస్తున్నాన‌ని చెప్పారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారంలో రేవంత్ రాజ‌కీయ కోణం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్ పైన‌, కాళేశ్వ‌రం క‌మిష‌న్‌పై నా.. ఆచితూచి వ్య‌వ‌హ‌రించిన బీజేపీ నాయ‌కులు ఇప్పుడు ఏం చేస్తార‌న్న‌ది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. తాము చేయాల్సింది తాము చేశామ‌ని.. రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఇక‌, ఇప్పుడు సీబీఐ ఉన్న‌ది కేంద్రంలో అంటే.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే స‌ర్కారు ప‌రిధిలో. సో.. ఇప్పుడు సీబీఐ ఏమేర‌కు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుంది.. ఏమేర‌కు కాళేశ్వ‌రం అవినీతిని వెలుగులోకి తెస్తుందనేది కేంద్రంలోని బీజేపీ పై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు.

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగింది ఒక ఎత్త‌యితే.. ఇక నుంచి జ‌ర‌గేదిమ‌రో ఎత్తు. సీబీఐ ద‌ర్యాప్తు పూర్తిగా(ఎంత స్వ‌తంత్ర సంస్థ‌యినా) కేంద్రం అధీనంలో ఉంది కాబ‌ట్టి.. కేంద్రంలోని పెద్ద‌లు.. ఏమేర‌కు త‌మ నిజాయితీని చూపిస్తార‌న్నది ఈ విచార‌ణ‌తో తేలిపోతుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. అందుకే రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని సిట్ కాకుండా.. కేంద్ర ప‌రిధిలోని సీబీఐ వైపు సీఎం రేవంత్ మొగ్గు చూపారని చెబుతున్నారు. ఫ‌లితంగా బీజేపీని ఒక‌ర‌కంగా ఆయ‌న ఇరికించార‌న్న వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.