కరోనాను కట్టడి చేసే ఏకైక ఉద్దేశంతోనే కఠినంగా ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ 1.0 సత్ఫలితాలనివ్వడంతో కరోనా వ్యాప్తిని పూర్తిగా నిరోధించేందుకు లాక్ డౌన్ 2.0ని విధించక తప్పలేదు.
లాక్ డౌన్ సమయంలో బయట తిరగకూడదని…సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వం, పోలీసులు మొత్తుకుంటున్నారు. ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజా ప్రతినిధులు కూడా కొంత కఠినంగానే వ్యవహరిస్తున్నారు. అయితే, ఏపీలో మాత్రం కొందరు ప్రజా ప్రతినిధులు లాక్ డౌన్ నిబంధనలు బేఖాతరు చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
లాక్ డౌన్ వేళ నలుగురికి చెప్పాల్సిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు….స్వతహాగా నిబంధనలు పాటించడం లేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. సదరు ఎమ్మెల్యేలు సమావేశాలు, సభలు, కార్యక్రమాల పేరుతో లాక్ డౌన్ నిబంధనలు తుంగలో తొక్కారని లాయర్ కిషోర్ పిల్ దాఖలు చేశారు.
పలువురు వైసీపీ ఎమ్మెల్యేలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఓ వైపు కరోనా కట్టడి కోసం ప్రజలంతా లాక్ డౌన్ ను కచ్చితంగా పాటిస్తుంటే మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు వివిధ కార్యక్రమాల పేరుతో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని లాయర్ కిషోర్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఇకపై వైసీపీ ఎమ్మెల్యేలు అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా అడ్డుకోవడంతో పాటు నిబంధనలు పాటించని వైసీపీ నేతలకు కరోనా పరీక్షలు నిర్వహించాలని పిటిషన్లో కోరారు. నగరి ఎమ్మెల్యే రోజా, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజినీ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడలను ఈ పిల్లో ప్రతివాదులుగా చేర్చాలని న్యాయస్థానాన్ని కిషోర్ కోరారు.
లాక్డౌన్ వేళ సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం ఎంతవరకు సబబని లాయర్ కిషోర్ ప్రశ్నించారు. కరోనా కట్టడి కోసం అందరూ ఇళ్లకే పరిమితం కావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్ాన…కొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడి లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని కిషోర్ పేర్కొన్నారు.