అధికార పార్టీ వైసీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పార్టీలో కీలకమైన ఇద్దరు ఎంపీలు ఢిల్లీ, విశాఖలను పం చేసుకున్నారని నాయకులు చర్చించుకుంటున్నారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి, జగన్‌కు అత్యంత సన్నిహి తుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విషయం అందరికీ తెలిసిందే. ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇంచార్జ్‌గా ఉన్న సాయిరెడ్డి.. ఆ నాలుగు జిల్లాల్లో చక్రం తిప్పుతున్నారు. అయితే, విశాఖ మాత్రం ప్రత్యేకం. విశాఖ మొత్తాన్ని ఆయన కనుసన్నల్లోనే పెట్టుకుని నడిపిస్తున్నారు. నగరం నుంచి జిల్లా వరకు ఏం జరగాలన్నా.. సాయిరెడ్డి చెప్పినట్టే జరగాలి. ఆయన వ్యూహం ప్రకారమే నడవాలి. ఈ పరిణామమే.. ఎంపీల నుంచి ఎమ్మెల్యేల వరకు వివాదాలు తలెత్తేలా చేసింది. తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చేలా కూడా చేసింది.
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. సాయిరెడ్డిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎవరి మాటను వినిపించుకోవడం లేదని ఎంపీ పరోక్షంగా విమర్శ చేస్తున్నారు. ఇక, నిన్న మొన్నటి వరకు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సహా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సాయిరెడ్డి వైఖరిపై గుస్సాగా ఉండడం.. సీఎం జగన్ పంచాయతీ పెట్టడం తెలిసిందే. సాయిరెడ్డి మాటకే ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం జగన్ సూచించడంతోపాటు ఇలా అయితే.. మున్ముందు కష్టమే అన్న వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో నేతలు సైలెంట్ అయ్యారు. కానీ, సాయిరెడ్డి దూకుడు మాత్రం మరింత పెరిగింది.
విశాఖ పరిస్థితి ఇలా ఉంటే.. ఢిల్లీ విషయానికి వద్దాం.. ఇది మరింత కీలకంగా మారింది. వైసీపీ పార్లమెంటరీపార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఢిల్లీ కేంద్రంగా చక్రం తిప్పుతున్నారు. ఢిల్లీలో ఎవరు ఏం చేయాలి? ఏ ఎంపీ ఎలా ఉండాలి? ఏ సబ్జెక్ట్‌ను ఎంచుకోవాలి? ఎవరిని కలవాలి? ఇలా అనేక అంశాలపై ఆయనే నిర్దేశం చేస్తున్నారని.. ఎంపీలకు స్వేచ్ఛ లేకుండా పోతోందని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఈ ఆధిపత్య ధోరణి మరింత పెరిగిందని అంటున్నారు. దీంతో ఎంపీలు నలిగిపోతున్నారని చర్చసాగుతోంది.
ఇక, ఎంపీ లాడ్స్ వినియోగం విషయంలోనూ.. మిథున్ రెడ్డి ప్రమేయం ఉంటోందని.. ఆయనకు చెప్పిన తర్వాతే.. ఎంపీలు వాటిని ఖర్చు చేయాలనే అప్రకటిత ఆదేశాలు వెళ్తున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇద్దరు ఎంపీల విషయం పార్టీలో ఆసక్తికర చర్చగా మారింది. ఎంపీలు అసహనంతో ఉన్న విషయాన్ని సీఎం జగన్ పట్టించుకోవడం లేదని.. తమ దయతో ఎంపీలు గెలిచారనే భావనతో ఉన్నారని కొందరు గుసగుసలాడడం… మీడియా మిత్రులకు ఉప్పందించే ప్రయత్నం చేయడం వంటివి చూస్తే.. ఈ ఇద్దరు ఎంపీల ఆధిపత్యం నివురు గప్పిన నిప్పు మాదిరిగా ఉందని అంటున్నారు. మున్ముందు ఇది విస్ఫోటనం కావడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.