ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై ఆయన స్పందిస్తూ.. ఇది కొసరేనని.. అసలు అభివృద్ధి ముందుందని చెప్పారు. గత 15 నెల్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్న ఆయన.. అసలు అభివృద్ధి, పెట్టుబడుల సాధన వంటివి ముందున్నాయని చెప్పారు. ఈ 15 మాసాల్లో 15 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు దక్కించుకున్నామన్నారు. ఇవి త్వరలోనే సాకారం అవుతాయని చెప్పారు. తద్వారా లక్షల మంది యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించారు. తాజాగా విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు.
రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఏం చేయనుందో సీఎం చంద్రబాబు వివరించారు. “ఏడాదిన్నర కూడా గడవకముందే.. సూపర్ 6 హామీలను అమలు చేశాం. మహిళలకు తల్లికి వందనం, ఉచిత ఆర్టీసీ బస్సులు చేరువ చేశాం. రైతులకు అన్నదాత సుఖీభవ ఇచ్చాం. ఇంకా చేయాల్సినవి చాలానే ఉన్నాయి. కొన్ని చెప్పినవి.. చాలా చెప్పనివి కూడా చేశాం. పెట్టుబడులు రానున్నాయి. వీటితో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగు పడనున్నాయి“ అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.
అదేవిధంగా రాజధానిని 2027 నాటికి సగానికిపైగా పూర్తి చేయనున్నట్టు వివరించారు. 2029 నాటికి పోలవరం పూర్తి చేసి నీరు అందిస్తామని చంద్రబాబు తెలిపారు. బనకచర్ల విషయంపై కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నామని, దీనికి సంబంధించి డీపీఆర్ కూడా రెడీ అవుతోందన్నారు. అయితే.. ఏదైనా పెద్ద ప్రాజెక్టును సంకల్పించినప్పుడు చిన్న చిన్న అవాంతరాలు వస్తాయని, కానీ, వీటిని వైసీపీ నేతలు పెద్దవి చేసి చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. వీటిని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. “రాముడంతటి వాడికి కూడా కష్టాలు తప్పలేదు.“ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నామని, రాక్షసులతో పోరాటం చేస్తున్నామని పరోక్షంగా వైసీపీ నాయకులపై విమర్శలు గుప్పించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates