టీడీపీ హయాంలో ఫుల్లుగా చక్రం తిప్పిన మంత్రి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. అటు నియోజకవర్గం లోను, ఇటు పార్టీలోనూ కూడా ఆయన వాయిస్ వినిపించడం లేదు. మరి దీని వెనుక ఉన్న రీజన్ ఏంటి? అసలు ఆ నాయకుడు ఎవరు? అనే చర్చ గుంటూరు జిల్లా రాజకీయాల్లో జోరుగాసాగుతుండడం గమనార్హం. విషయంలోకి వెళ్తే..గుంటూరు జిల్లా చిలకలూరి పేటకు చెందిన ప్రత్తిపాటి పుల్లారావు.. 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. వరుస విజయాలతో ఆయనకు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. ఇదే జిల్లాకు చెందిన మంత్రి ఒకరు మధ్యలోనే పదవి కోల్పోయినా.. ప్రత్తిపాటి మాత్రం ఐదేళ్లు కొనసాగడం విశేషం.
ఇక, జిల్లాలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. చంద్రబాబు సామాజిక వర్గానికే చెందిన ప్రత్తిపాటి కీలకంగా మారారు. అయితే.. గత ఏడాది ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేసిన విడదల రజనీపై పరాజయం పాలయ్యారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమే అయినా.. ప్రత్తిపాటి మాత్రం గడప దాటి బయటకు రావడం లేదు. ఏదో అప్పుడప్పుడు రాజధాని విషయంలో జరుగుతున్న ఆందోళనలకు హాజరవుతున్నారు. ఆ తర్వాత మళ్లీ మౌనం.. నాయకులతోనూ ఎక్కడా టచ్‌లో ఉండడం లేదు.
అయితే. చంద్రబాబు ఇటీవల పార్టీ పదవుల్లో ప్రత్తిపాటికి ప్రాధాన్యం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అయినప్పటికీ.. పుల్లారావులో అధికారంలో ఉన్నప్పటి దూకుడు ఇప్పుడు కనిపించడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే రజనీ దూకుడు పెరిగింది. టీడీపీ శ్రేణులను పార్టీ లోకి చేర్చుకోవడం దగ్గర నుంచి కార్యక్రమాలు నిర్వహించడం వరకు కూడా రజనీ భారీ రేంజ్‌లో దూసుకు పోతోందని అంటున్నారు. దీంతో టీడీపీ జెండా మోసే నాయకుడు కూడా ఇప్పుడు కరువయ్యారని పార్టీ నాయకత్వమే చెబుతుండడం గమనార్హం.
ఇక, ప్రత్తిపాటి వ్యూహం ఏంటనే విషయం కూడా ఆసక్తిగా ఉంది. వైసీపీ దానంతట అదే ప్రభావం కోల్పోయినప్పుడు.. ఆ పార్టీ నేతలు వారిలో వారే.. ఘర్షించుకుని పార్టీని ఛిన్నాభిన్నం చేసుకున్నప్పుడు తాను విజృంభిస్తానని ఆయన చెప్తున్నారట.మరి అప్పటి వరకు ఆయన మౌనంగానే ఉండనున్నారు. కానీ, ఏ పార్టీకైనా ఇది సాధ్యమేనా? నాయకులు ఇలా వ్యవహరించొచ్చా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
Gulte Telugu Telugu Political and Movie News Updates