దాదాపు 15 ఏళ్ల తర్వాత.. భారత్ చేస్తున్న ప్రయత్నం.. కామన్‌వెల్త్ క్రీడల నిర్వహణకు పావులు కదపడం. దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ పచ్చ జెండా ఊపింది. దీనికి సంబంధించి అంతర్జాతీయ కామన్‌వెల్త్ క్రీడల సంఘం నిర్వహించే బిడ్డింగ్‌లో పాల్గొనాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పుడు వేసే బిడ్ ద్వారా 2030లో నిర్వహించే కామన్‌వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వాలని మోడీ సర్కారు భావిస్తోంది.
కాగా.. భారత్ బిడ్ వేసేందుకు ఇండియా ఒలింపిక్ సంఘం అంగీకరించింది. అయితే.. ఈ క్రీడలకు ఆతిధ్యం ఇచ్చేందుకు భారత్‌తో పాటు నైజీరియా సహా.. ఇతర దేశాలు కూడా ఆసక్తిగా ఉన్నాయి. ఈ నేపథ్యం లో భారత్ ప్రయత్నం ఏమేరకు సాకారం అవుతుందన్నది ప్రశ్నగా మారింది. దీనికి కారణం.. 2010లో భారత్‌లో నిర్వహించిన కామన్ వెల్త్ క్రీడలు వివాదాలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో తదుపరి సంవత్సరం కూడా భారత్‌లో నిర్వహించాలన్న విషయానికి బ్రేకులు పడ్డాయి.
అప్పటి నుంచి కూడా భారత క్రీడాకారులు కామన్‌వెల్త్ క్రీడల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ.. 2010లో అప్పటి ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు, వివాదాలకు కూడా దారి తీసింది. అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని అప్పట్లో కామన్ వెల్త్ అంతర్జాతీయ సంఘం ఆరోపించడంతోపాటు.. దీనిపై విచారణ కూడా చేయించారు. సుమారు 200 కోట్ల రూపాయల మేరకు అప్పట్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీంతో కొన్నాళ్లపాటు భారత్‌ను బ్లాక్ లిస్టులో కూడా పెట్టారు.
ఫలితంగా అంతర్జాతీయ వేదికపై భారత్ వ్యవహారం అప్పట్లో చర్చకు దారితీసింది. కామన్‌వెల్త్‌ను అప్పటి సీఎం షీలాదీక్షిత్ క్యాష్ చేసుకున్నారని.. బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆధారాలతో సహా.. కోర్టుకు కూడా వెళ్లారు. అనుమతుల నుంచి క్రీడాకారులకు ఇచ్చే ఆహారం వరకు అన్నింటిలోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాల అనంతరం.. దాదాపు 15 ఏళ్ల తర్వాత.. భారత్ బిడ్ వేసేందుకు అనుమతి రావడం గమనార్హం. మరి దీనిలో ఏమేరకు దేశం సక్సెస్ అవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates