కేంద్రంలో మంత్రి వర్గ ప్రక్షాళనకు రంగం రెడీ అయింది. వచ్చే నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉంది. ఇది పూర్తికాగానే.. దసరా సందర్భంగా(అక్టోబరు తొలివారం) మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలని ప్రధానమంత్రి నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే బీహార్‌లో ఎన్నికలు ఉన్నాయి. ఇదే సమయంలో తమిళనాడులోనూ వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలకు చెందిన కీలక నాయకులకు పదవులు ఇవ్వాలని భావిస్తున్నారు. తమిళనాడు నుంచి అవసరమైతే .. రాజ్యసభకు పంపించి అయినా పదువుల ఇవ్వనున్నారు.
ఇలాంటి వారిలో తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై పేరు జోరుగా వినిపిస్తోంది. ఇక, ఏపీకి సంబంధించినంత వరకు.. తమకు మద్దుతగా నిలుస్తున్న చంద్రబాబును మరింత మచ్చిక చేసుకునేందుకు కూడా మోడీ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మరో సీటును ఏపీకి రిజర్వ్ చేయడం ఖాయమని అంటున్నారు. వాస్తవానికి ఈ విషయంపై చంద్రబాబుకు ఇప్పటికే ఉప్పందిందని.. ఈ విషయంలో చంద్రబాబు కూడా ఎంపిక చేస్తున్నారని సమాచారం. ఈ దఫా సీమకు ఈ పదవి దక్కుతుందని తెలిసింది.
ప్రస్తుతం ఏపీ నుంచి ముగ్గురు కేంద్ర మంత్రులు ఉన్నారు. వీరిలో భూపతిరాజు శ్రీనివాసవర్మ.. బీజేపీ నేతే కాబట్టి.. ఆయనను పక్కన పెడితే.. టీడీపీకి చెందిన శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు పౌర విమానాయాన శాఖ మంత్రిగా ఉన్నారు. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్.. సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అంటే.. అటు ఉత్తరాంధ్రకు, ఇటు కోస్తాకు కూడా.. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నట్టు అయింది. ఈ క్రమంలో సీమ నుంచి కూడా ఒక ఎంపీని కేంద్రంలో మంత్రిని చేయాలన్నది బాబు వ్యూహం.
మోడీ ఇచ్చేందుకురెడీగా ఉన్న నేపథ్యంలో.. సీమ నుంచి మంచి ఎంపీ విషయంలో చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఇద్దరు ఎంపీలు పోటీలో ఉన్నారని సమాచారం. అనంతపురం, చిత్తూరు ఎంపీలు ఈ రేసులో పోటీ పడుతున్నారని తెలుస్తోంది. అయితే.. హిందూపురం ఎంపీ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తున్నా.. ఎక్కువ అవకాశం ఎస్సీ నాయకుడు లేదా.. కీలక సామాజిక వర్గానికి చెందిన ఎంపీకి దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలలో చర్చ సాగుతోంది. ఏదేమైనా.. ఈ దఫా సీమకు న్యాయం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates