వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనను ఆకాశానికెత్తని రోజు లేదంటే అతిశయోక్తి కాదేమో. ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా… తన పాలనా కాలం స్వర్ణయుగమని కూడా ఆయన చెప్పుకున్న సందర్భాలు ఎన్నో. అయితే ఆయన చేయలేక చేతెలెత్తేసిన చాలా పనులను ఇప్పుడు కూటమి సారథి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వరుసబెట్టి చేసేస్తున్నారు. జగన్ కు పాలన ఎంతమాత్రం చేతకాదని కూడా బాబు తన చర్యల ద్వారానే చెప్పేస్తున్నారు. ఆరేళ్లుగా ఆర్టీసీలో నిలిచిపోయిన పదోన్నతులకు మంగళవారం బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వెరసి ఆర్టీసీలో ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంంది.
2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్టీసీ కార్మికులకు జగన్ భారీ హామీలే ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో చేరుస్తామని, ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగా వేతనాలు ఉంటాయని ఊరించారు. జగన్ హామీలకు జనంతో పాటు ఆర్టీసీ కార్మికులు కూడా ఆకర్షితులయ్యారు. జగన్ గెలిచారు. ఆర్టీసీని ప్రభుత్వంలో చేర్చారు. అంతే… ఇక ఆ సంస్థలో చేపట్టాల్సిన సంస్కరణల విషయం గురించి మరిచారు. ఉద్యోగుల పదోన్నతుల విషయాన్ని పూర్తిగా మరిచారు. ఉద్యోగులు ఎంతగా మొత్తుకున్నా జగన్ మనసు కరగలేదు. ఫలితంగా ఆరేళ్లుగా ఆర్టీసీలో పదోన్నతులే లేకుండా కాలం గడిచిపోయింది.
తాజాగా కూటమి సర్కారు అదికారంలోకి వచ్చాక ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు అటు సీఎం చంద్రబాబును, ఇటు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలను తరచూ కలిసి తమ సమస్యను, పదోన్నతులు నిలిచిన విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా ఆర్టీసీ పదోన్నతులపై సమీక్ష చేసిన చంద్రబాబు ఆరేళ్లుగా సంస్థలో పదోన్నతులు లేకుంటే ఉద్యోగులు నష్టపోతారు కదా అంటూ అధికారులను ప్రశ్నించారు. తక్షణమే ఆర్టీసీలో ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ఆర్టీసీలో ఉద్యోగుల పదోన్నతుల సంబందించిన విధివిధానాలను ఖరారు చేసిన ఉన్నతాధికారులు తొలుత మంత్రి మండిపల్లికి, ఆ తర్వాత సీఎం ముందు ప్రతిపాదనలు పెట్టారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన చంద్రబాబు తక్షణమే పదోన్నతులు చేపట్టండి అని ఆదేశించారు. బాబు ఆదేశాలతో ఆర్టీసీలో అసిస్టెంట్ మెకానిక్ స్థాయి నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దాకా పదోన్నతులు కల్పించనున్నారు. ఆర్టీసీలో ఉద్యోగుల పదోన్నతులకు అనుమతి ఇచ్చిన బాబుకు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) నేత దామోదర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates