ఐఏఎస్ శ్రీల‌క్ష్మి.. ఓ తాట‌కి: భూమ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వైసీపీ సీనియ‌ర్ నేత‌, తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి.. రాజ‌కీయ నేత‌ల‌పై త‌ర‌చుగా విమర్శ‌లు చేయ‌డం తెలిసిందే. అయితే.. తాజాగా ఆయ‌న ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారి శ్రీల‌క్ష్మిపై విరుచు కుప‌డ్డారు. ఆమెను ఏకంగా `తాట‌కి` అంటూ సంబోధించారు. తాజాగా సెల్ఫీ వీడియో విడ‌ద‌ల చేసిన భూమ‌న‌.. ఆర్థిక శాఖ స‌హా మైనింగ్ ఇత‌ర శాఖ‌ల‌కు కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి శ్రీల‌క్ష్మిపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హ‌యాంలో జ‌రిగిన టీడీఆర్ కుంభ‌కోణంపై కూట‌మి ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. ఈ వ్య‌వ‌హారం భూమ‌న ప్రాతినిధ్యం వ‌హించిన‌ తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ జ‌రిగింద‌ని ఇటీవల మంత్రి నారాయ‌ణ వ్యాఖ్యానించారు. ఈ కేసును తీవ్రంగా తీసుకుంటున్న‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు. ఆధారాలు సేక‌రిస్తున్నామ‌ని, ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు ఫిర్యాదులు కూడా అందాయ‌ని వివ‌రించారు. వీటిపై దృష్టి పెట్టి కేసులు న‌మోదు చేయ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో భూమ‌న స్పంద‌న ఆస‌క్తిగా మారింది.

ఆయ‌న నేరుగా.. వైసీపీ హ‌యాంలో పుర‌పాల‌క శాఖ కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన‌.. ఐఏఎస్ శ్రీల‌క్ష్మిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. “ఆమె ఓ తాట‌కి(రామాయ‌ణంలో రాక్ష‌సి పాత్ర‌పేరు). అధికారుల‌ను వేధించుకు తినేది. క‌నీసం మంత్రులకు కూడా ఆమె విలువ ఇవ్వ‌కుండా పూచిక పుల్ల‌ల్లా తీసిపారేసేది. ప్ర‌భుత్వం ఆమె సొత్తు అయిన‌ట్టు వ్య‌వ‌హ‌రించింది. ఆమె వ‌ల్లే టీడీఆర్ బాండ్ల కుంభ‌కోణం జ‌రిగింది. ఆమెకు ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌న్న ఆస‌క్తి ఏ మాత్రం లేదు. ప్ర‌జ‌ల సొమ్మును టీలో బ‌న్నులా నంజుకు తినేసింది.“ అని భూమ‌న తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

నైతిక విలువ‌లు ఏమాత్రం లేని మ‌నిషి ఐఏఎస్ అయితే.. ఎలా ఉంటుందో దానికి శ్రీల‌క్ష్మి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ అని భూమ‌న వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే.. క‌ర్ణాట‌క‌కు చెందిన మైనింగ్ కింగ్‌, అక్ర‌మాల కేసులో జైలు శిక్ష ప‌డ్డ‌.. మాజీ మంత్రి జ‌నార్ద‌న్‌రెడ్డి కేసులోనూ శ్రీల‌క్ష్మి తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో ఆమె గ‌నుల శాఖ కార్య‌ద‌ర్శిగా వ్య‌వ‌హ‌రించి.. అక్ర‌మాల‌కు ఊత‌మిచ్చార‌న్న‌ది సీబీఐ అధికారులు చెబుతున్న మాట‌.