వైసీపీ మరో తప్పు.. అలా వద్దంటున్న నేతలు..!

ఏపీ ప్రతిపక్షం వైసీపీలో తప్పులపై తప్పులు జరుగుతూనే ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు వలంటీర్లను నమ్ముకుని నిండా మునిగారు. అప్పట్లో నాయకులకు ప్రాధాన్యం ఇవ్వలేదు. కార్యకర్తలను పట్టించుకోలేదు. దీంతో పార్టీ పరిస్థితి ఎన్నికల నాటికి ఇబ్బందిగా మారిపోయింది. అంతేకాదు, నమ్ముకున్న వలంటీర్లు యూటర్న్ తీసుకున్నారు.

దీనిని అప్పట్లోనే నాయకులు హెచ్చరించారు. తమకు ప్రాధాన్యం లేకుండా వలంటీర్లకే సర్వాధికారులు ఇస్తున్నారని వగర్చారు. అయినా అధినేత పట్టించుకోలేదు.

ఇక ఇప్పుడు పార్టీని గాడిలో పెట్టేందుకు, పుంజుకునేలా చేసేందుకు మరో మంత్రం పఠించాలంటూ కోరుతున్నా, కేవలం జిల్లా స్థాయిలో నాయకులను నియమించి చేతులు దులుపుకుంటున్నారు. ఇదిలావుంటే తమకు అవసరం లేదని, తమకు భారంగా మారుతున్నారని ఓ నేతపై ఆరోపణలు చేస్తున్నా, ఆయన్నే మరోసారి సర్వాధికారం అప్పగించారు.

ప్రజానాయకుడు కూడా కాని, వార్డు నేతగా కూడా ఎన్నిక కాని ఆయనకు తమపై పెత్తనం చేసే అధికారం ఎందుకు ఇస్తున్నారన్నది పార్టీలో జరుగుతున్న చర్చ.

దీనిపై మరోసారి పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తీవ్ర చర్చ, రచ్చగా మారుతోంది. ఇదిలావుంటే అంతా సోష‌ల్ మీడియాపైనే బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు నాయకులకు మరింత ఇబ్బందిగా మారింది. బాధ్యతలు ఇవ్వడం తప్పుకాదని, కానీ పార్టీ తరఫున ప్రజల మధ్యకు వెళ్లే తమకు నిధులు ఇవ్వకుండా మీరే భరించాలంటూ చెప్పడం, సోష‌ల్ మీడియాకు భారీ ఎత్తున నిధులు కేటాయించడం నాయకుల్లో అసంతృప్తికి దారితీస్తోంది.

“మేం ప్రజల మధ్యకు వెళ్తే ఫలితం ఉంటుంది. సోష‌ల్ మీడియా ద్వారా ఎంతవరకు ఉంటుంది? నిధులు ఇవ్వడం తప్పుకాదు. కానీ సోష‌ల్ మీడియానే సర్వస్వం అనుకోవడం సరికాదు. మాకు కూడా కొంత మేరకు నిధులు ఇవ్వాలి,” అని ఓ నాయకుడు కీలక సలహాదారునికి తేల్చి చెప్పారు.

దానికి ఆయన స్పందిస్తూ, “ఎన్నికల్లో మీకు టికెట్లు ఇస్తున్నాం. కాబట్టి ఆ మేరకు భారం ఇప్పుడు మీరు భరించాలి. సోష‌ల్ మీడియాను బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నాం,” అని చెప్పారు.

దీనిపై మెజారిటీ నాయకులు గుస్సాగా ఉన్నారు. మరి దీనిని మారుస్తారా లేదా చూడాలి.