ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున అభ్యర్థిగా నిలబడ్డ.. మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ. సుదర్శన్ రెడ్డిని గెలిపించుకునేందుకు కూటమి పార్టీలు శత విధాల ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తమ కూటమిలోని మిత్రపక్షాలు ఏకగ్రీవంగా ఎంపిక చేయడంతో వారితో పాటు.. ఎన్డీయే కూటమిలోని కొన్నిపార్టీలను కూడా మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరితోపాటు.. ఎన్డీయే-ఇండియా కూటముల్లో లేని.. తటస్థ పార్టీలు(వైసీపీ, బీజేడీ(ఒడిశా), అవామీ, తదితర పార్టీలను మచ్చిక చేసుకుని సుదర్శన్ రెడ్డి విజయం దక్కేలా తెరవెనుక చక్రం తిప్పుతున్నారు.
అయితే, వైసీపీ ఈ విషయంలో ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది. తమకు కాంగ్రెస్ పార్టీ బద్ధ శత్రువని, కాబట్టి.. ఆ పార్టీ తరఫున బరిలో ఉన్న సుదర్శన్ రెడ్డికి తామెలా మద్దతిస్తామని.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తమ మద్దతు మీకే నంటూ.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు తాజాగా మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. ఈ పరిణామాలతో వైసీపీ దాదాపు ఎన్డీయే వైపు మొగ్గు చూపినట్టు అయింది. అయినప్పటికీ.. తమ ప్రయత్నాలను ఇండియా కూటమి ముమ్మరం చేస్తోంది. మరోవైపు, ఒడిశా విపక్షం బిజు జనతాదళ్(బీజేడీ) అధినేత , మాజీ సీఎం నవీన్ పట్నాయక్‌తో నూ.. ఇండియా కూటమి నాయకులు సంప్రదిస్తున్నారు.
తటస్థ వైఖరితో ఉన్న నవీన్ పట్నాయక్ తమకు సహకరించాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించే క్రతువులో పాలు పంచుకోవాలని విన్నవిస్తున్నారు. అయితే.. నవీన్ తటస్థంగా ఉన్నప్పటికీ.. స్థానిక ప్రయోజనాలు, రాష్ట్రంలో తమ పార్టీ నాయకులపై ఉన్న కేసుల నేపథ్యంలో ఆయన అంతర్గతంగా ఎన్డీయేకు మద్దతు ప్రకటిస్తున్నారు. అయితే.. దీనిపై బహిరంగ వ్యాఖ్యలు చేయడం లేదు. ఇక, అవామీ లీగ్ పార్టీ ఇండియా కూటమిలో లేకపోయినా.. దాదాపు మద్దతుగా ఉంది. కానీ, ఈ పార్టీని కూడా బీజేపీ తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు ముమ్మరం కావడంతో కాంగ్రెస్ నేతలు అలెర్టు అయ్యారు. అవామీ లీగ్‌కు ముగ్గురు ఎంపీలు ఉన్నారు.
ఇక, హైదరాబాద్ ఎంపీ.. అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీని కూడా తమవైపు తిప్పుకొనేప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి. వాస్తవానికి బీజేపీకి వ్యతిరేకం అయినా.. ఎంఐఎంకు బీజేపీకి -బీ పార్టీ అనే పేరుంది. ఈ నేపథ్యంలో చివరి నిముషంలో ఎంఐఎం అధినేత బీజేపీకి మద్దతు తెలిపే అవకాశం ఉంది. అయినప్పటికీ ఓ రాయి వేస్తే పడి ఉంటుందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఆ ప్రయత్నాన్ని కూడా ముమ్మరం చేశారు. ఇక, ఇన్ని చేసినా.. చివరి నిముషంలో ఏదైనా తేడా కొట్టి సుదర్శన్ రెడ్డి ఓడిపోతే.. ఆయనను గౌరవించే ఉద్దేశంతో ఆయనను రాజ్యసభకు పంపించాలని ఖర్గే నేతృత్వంలోని బృందం నిర్ణయించింది. దేశంలో ఎక్కడినుంచైనా ఆయనను రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్టు తెలిసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates