తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్య చేశారు. తెలంగాణ ఉద్యమాల గడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేసిన అనంతరం రేవంత్… తిరిగి తాను మరోమారు ఓయూకు వస్తానని, ఈ దఫా ఒక్క పోలీసు కూడా వర్సిటీ ప్రాంగణంలో ఉండరని ఆయన ప్రకటించారు. ఈ మేరకు డీజీపీ, సిటీ పోలీస్ కమిషనర్ లకు ఇప్పుడే ఆదేశాలు జారీ చేస్తున్నానని ఆయన తెలిపారు. రేవంత్ నోట నుంచి ఈ వ్యాఖ్య వినిపించగానే… ఓయూ విద్యార్థుల నుంచి పెద్ద పెట్టున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
ఉస్మానియా వర్సిటీ ఉద్యమ ప్రస్థానంతో తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి… తెలంగాణ ఉద్యమానికి ఆది ఓయూనేనని తెలిపారు. సమాజంలో ఏ సమస్య ఉత్పన్నమైనా ఓయూ విద్యార్థులే తొలుత స్పందిస్తున్న తీరును కూడా ఆయన గుర్తు చేశారు. ఓయూ పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా సాకారం అయ్యిందన్నారు. అలాంటి వర్సిటీని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. మరోమారు బీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వస్తే… ఉస్మానియా వర్సిటీ అడ్రెస్సే గల్లంతవుతుందని ఆయన సంచలన ఆరోపణ చేశారు.
ఈ సందర్భంగా తన ఓయూ టూర్ పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు చేసిన కామెంట్లను రేవంత్ స్పందించారు. రేవంత్ పర్యటన సందర్భంగా ఓయూలోని విద్యార్థులను మూడు రోజులుగా అరెస్టు చేస్తున్నారని, అడుగుకో పోలీసును పెట్టి భద్రతను పటిష్టం చేస్తున్నారని, ఇంత భద్రత మధ్య ఏం చేయడానికి వెళుతున్నారు రేవంత్ గారూ అంటూ హరీశ్ ప్రశ్నించారు. పోలీసు కబంధ హస్తాల్లో విద్యార్థులను బంధించి చేసే సీఎం పర్యటనకు అర్థం ఉంటుందా అని కూడా ఆయన ఎద్దేవా చేశారు.
హరీశ్ వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారో, లేదంటే ఉద్యమ స్ఫూర్తితో ఆ మాటలే గుర్తుకు వచ్చాయో తెలియదు గానీ.. తాను మరోమారు ఓయూకు వస్తానని, ఈ దఫా మీకున్న సమస్యలన్నీ చెప్పండి… ఎన్ని నిధులు అవసరమైనా అక్కడికక్కడే ఇస్తానని ఆయన ప్రకటించారు. తన మలి పర్యటన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా కేంద్రం ప్రకటించిన డిసెంబర్ లోనే తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆ పర్యటనలో ఓయూలో ఒక్క పోలీసు కూడా వర్సిటీ ప్రాంగణంలో ఉండకుండా చూడాలన్నారు. ఈ మేరకు డీజీపీ, సిటీ పోలీస్ కమిషనర్ లకు ఆదేశాలు జారీ చేస్తున్నానని తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates