లోకేష్ మాటతో నిరుద్యోగులకు ఏటా పండుగే!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి (విద్య) శాఖ మంత్రి అటు రాజకీయాలతో పాటు ఇటు పాలనలోనూ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే తనదైన శైలి ప్రతిభతో కేంద్రం నుంచి ఏపీకి లెక్కలేనన్ని నిధులు విడుదలయ్యేలా చేయడంతో పాటుగా తన పరిధిలోని శాఖలకు అదనపు నిధులు కూడా రాబట్టారు. ఏపీ విద్యా శాఖను దేశానికి రోల్ మోడల్ చేసే దిశగా సాగుతున్న లోకేష్… శుక్రవారం ఓ కీలక ప్రకటన చేశారు. ఇకపై ఏటా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నిర్వహిస్తామని ఆయన సంచలన ప్రకటన చేశారు.

ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోనే 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులతో డీఎస్సీ ప్రకటించిన లోకేశ్… ఆ ప్రక్రియను త్వరలోనే ముగించనున్నారు. అంటే అతి త్వరలో ఏపీ విద్యా శాఖకు అదనంగా 16 వేలకు పైగా టీచర్ పోస్టులు అందుబాటులోకి రానున్నాయి. ఇక ఏటా రిటైరయ్యే ఉపాధ్యాయుల కారణంగా ఏర్పడే ఖాళీలు, కొత్తగా ఉత్పన్నమయ్యే పోస్టులతో కలిపి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా డీఎస్సీ నిర్వహిస్తామని లోకేష్ ప్రకటించారు.

ఏటా డీఎస్సీ విడుదలకు గల కారణాలను కూడా లోకేష్ విస్పష్టంగా చెప్పారు. ఏపీ విద్యా వ్యవస్థను దేశానికే తలమానికంగా నిలబెట్టేలా చేసే చర్యల్లో భాగంగా ఇప్పటికే విద్యా శాఖలో సంస్కరణలను మొదలుపెట్టామని లోకేష్ చెప్పారు. సంస్కరణలు ముందుకు సాగాలంటే మానవ వనరుల తోడ్పాటు, వాటికి మరింతగా పెంపొందించుకోకపోతే ఎలా సాధ్యపడుతుందని కూడా ఆయన ప్రశ్నించారు. సర్కారీ విద్యలో మౌలిక వసతులను మెరుగుపరుస్తూనే… మరో వైపు మానవ వనరులను కూడా పెంచుతామని ఆయన చెప్పుకొచ్చారు. 

వైసీపీ పాలనలో నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా విద్యా శాఖను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా నాడు నేడు అంటూ మౌలిక వసతుల కల్పనపైనే దృష్టి సారించారు. అంతేకాకుండా ఆయా అభివృద్ధి పనులను పర్యవేక్షించే బాధ్యతను అరకొరగా ఉన్న ఉపాధ్యాయులకే అప్పగించారు. అసలే టీచర్ల కొరత ఉంటే… బోధనతో పాటు ఈ పనులు చేసేదెలా అని నెత్తీనోరు బాదుకున్నారు. మరోవైపు ఐదేళ్లలో జగన్ ఒక్క టీచర్ పోస్టునూ భర్తీ చేయలేదు. మానవ వనరుల అభివృద్ధి లేకుండా సంస్కరణల అమలు సాధ్యం కాదన్న విషయాన్ని జగన్ గ్రహించలేకపోతే… లోకేష్ మాత్రం లోతైన అధ్యయనంతో పక్కా పకడ్బందీ చర్యలతో ముందుకు సాగుతున్నారు.