జనసేన నేతపై కేసు: ప‌వ‌న్ అనుమతి

సొంత పార్టీ నేతలే తప్పు చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చెబుతున్నట్టుగానే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా జనసేన నాయకుడిపై కేసు పెడతామంటూ ఆయన అనుమతి కోరుతూ వచ్చిన పోలీసులకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో జనసేన కీలక నాయకుడిపై శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనను ఏ1గా పేర్కొన్నారు.

ఏం జరిగింది?

రెండు రోజుల క్రితం శ్రీశైలం అటవీ ప్రాంతంలో రాత్రి సమయంలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పర్యటించారు. ఈ సమయంలో అటవీ ప్రాంతంలోకి వెళ్లరాదని, సమయం ముగిసిపోయిందని పేర్కొంటూ అటవీ సిబ్బంది బారికేడ్లు పెట్టారు. అయితే తాను ఎమ్మెల్యేనని ఎందుకు తీయరని ప్రశ్నించిన రాజశేఖర్ అటవీ సిబ్బందిపై బూతుల వర్షం కురిపించారు. అంతేకాదు తన సిబ్బందితో వారిని నిర్బంధించి వారి జీపును తానే నడుపుతూ చిత్రహింసలకు గురిచేశారని అటవీ సిబ్బంది ఆరోపిస్తున్నారు.

ఈ వ్యవహారం తీవ్రస్థాయిలో రాజకీయాలను కుదిపేసింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే దారి తప్పుతున్నారని చర్చ జోరుగా సాగింది. వెంటనే స్పందించిన చంద్రబాబు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కేసు కూడా పెట్టాలని పోలీసులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. అటవీ సిబ్బందిపై దాడి చేసిన నిందితులను గుర్తించారు. అయితే వీరిలో ప్రధాన నిందితుడు జనసేన ఇంచార్జ్ అశోక్ రౌత్ అని పోలీసులు తేల్చారు.

తర్వాత జాబితాలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి (ఏ2)ని పేర్కొన్నారు. ఆయన అనుచరులను కూడా ఈ కేసులో నిందితులుగా పేర్కొంటూ అనుమతి కోరారు. దీనికి పవన్ కళ్యాణ్ ఒకే చెప్పారు. శ్రీశైలం జనసేన పార్టీ ఇంచార్జ్ అశోక్ రౌత్‌పై కేసు పెట్టేందుకు అభ్యంతరం లేదని తెలిపారు. మరోవైపు అటవీ శాఖ సిబ్బంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. వారి విజ్ఞప్తిని విన్న పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తామని, నిందితులు ఎవరైనా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.