కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో పలు బిల్లులను ప్రవేశపెట్టి, వాటికి ఆమోదం కూడా సాధించింది. తాజాగా బుధవారం కేంద్రం తీసుకురానున్న ఓ బిల్లు గురించి తెలిసిన వెంటనే దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రత్యేకించి విపక్ష పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయి. ఆ పార్టీల నేతల్లో వణుకు మొదలైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజ్యాంగంలోని 130 అధికరణకు సవరణ బిల్లు పేరిట కేంద్రం ప్రవేశపెట్టనున్న ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే… దేశ ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుని జైలుపాలై 30 రోజుల పాటు జైల్లో ఉంటే వారు ఆ మరుక్షణమే పదవీచ్యుతులు అయిపోతారు.
బీజేపీ అగ్ర నేత అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ బిల్లుకు ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. మంగళవారం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ఈ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేబినెట్ ఆమోద ముద్ర వేసిన మరునాడు బుధవారమే ఈ బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేయడం గమనార్హం. 5 ఏళ్ల జైలు శిక్ష పడే క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉండి… అరెస్టై 30 రోజులు జైల్లో ఉంటే ప్రధాని అయినా, సీఎం అయినా, కేంద్ర, రాష్ట్ర మంత్రులు అయినా తమ పదవులను వదులుకోవాలి. లేదంటే… 31వ రోజు వారి పదవులు ఆటోమేటిక్ గా ఊడిపోతాయి.
ఈ బిల్లును బయటి నుంచి చూస్తే చాలా పారదర్శకతతో కూడి బిల్లుగా కనిపిస్తోంది. అయితే ఈ బిల్లు అమలులోనే అసలు సమస్య ఉత్పన్నమవుతుందన్నది విశ్లేషకుల మాటగా వినిపిస్తోంది. విపక్ష నేతలను టార్గెట్ చేసి వారిని వేధించేందుకు కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీలు ఈ బిల్లును దుర్వినియోగం చేసే అవకాశం లేకపోలేదని వారు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో అసలు పీఎం, సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులు అరెస్టై 30 రోజులకు పైగా జైలులో ఉండే నేతలు అసలు ఉంటారా?.. ఉన్నా వారిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు కదా.. ఆ మాత్రం దానికి ఇంత కఠినమైన బిల్లును తీసుకురావాలా? అని కూడా రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
ఇక విపక్షాలైతే… ఈ బిల్లు గురించి తెలిసిన వెంటనే ఓ భయంతో వణికిపోతూనే, మరోవైపు మోదీ సర్కారు తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, మంత్రులను వేధించేందుకే ఈ బిల్లుకు మోదీ సర్కారు అమలులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఫలితంగా దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనూ తమ పార్టీ కాని ప్రభుత్వాన్ని కొనసాగకుండా ఉండేలా మోదీ, షాలు ఈ బిల్లు ద్వారా వ్యూహరచన చేస్తున్నారని ధ్దజమెత్తుతున్నారు. ఈ తరహా బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని కూడా వారు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు క్రిమినల్ కేసులు కలిగిన విపక్షాలకు చెందిన నేతలు ఈ బిల్లు అమల్లోకి వస్తే తమ పని అయిపోయినట్టేనని భయపడిపోతున్నారు.
ఇదిలా ఉంటే… బుధవారం పార్లమెంటు ముందుకు ఈ బిల్లు వస్తే… అది అప్పటికప్పుడే ఆమోదం పొందే అవకాశం లేదనే చెప్పాలి. ఎందుకంటే… పీఎం, సీఎం స్థాయి పదవులపై చర్యల విషయం కాబట్టి దీనిపై విస్తృత స్థాయి చర్చకు విపక్షాలు పట్టుబట్టే అవకాశాలున్నాయి. అదే సమయంలో అధికార పక్షం కూడా ఇందుకు ఇప్పటికే సిద్దమైనట్టు సమాచారం. కీలక బిల్లుపై సుదీర్ఘ చర్చ లేకుంటే తన సచ్ఛీలతపై మకరలు పడే ప్రమాదం ఉన్నందునే మోదీ సర్కారు కూడా దీనిపై సుదీర్ఘ చర్చకు రెడీ అయిపోయింది. అంతేకాకుండా జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి కూడా ఈ బిల్లును ప్రతిపాదించే అవకాశాలున్నాయి. ఈ లెక్కన బుధవారం పార్లమెంటు ముందుకు వచ్చే ఈ బిల్లు… పార్లమెంటు ఆమోదం లభించి చట్టంగా మారేందుకు చాలా కాలమే పడుతుందని చెప్పవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates