ఆ ఎంఎల్ఏపై క్యాడరంతా మండిపోతున్నారా ?

నియోజకవర్గంలో ఇపుడీ అంశంపైనే చర్చ జరుగుతోంది. మొదటిసారి గెలిచిన ఎంఎల్ఏకి నేతలు, క్యాడర్ తో బాగా గ్యాప్ వచ్చేసిందని పార్టీలోనే చెప్పుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటి ? ఎంఎల్ఏ ఎవరు ? అనేదే కదా మీ డౌటు. ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గం ఎంఎల్ఏ బుర్రా మదుసూధన యాదవ్ గురించే ఇదంతా. 2014లో పోటీ చేసి ఓడిపోయిన యాదవ్ 2019 ఎన్నికల్లో 30 వేల ఓట్లకు పైగా మెజారిటి గెలిచారు. 30 వేల ఓట్ల మెజారిటి అంటే చిన్న విషయం కాదు. గెలిచిన తర్వాత కొంతకాలం ఎంఎల్ఏ అందరితోను కలివిడిగానే ఉన్నారట. తర్వాత ఏమైందో ఏమో గ్యాప్ పెరిగిపోయిందట.

అసలు విషయం ఏమిటా అని ఆరా తీస్తే కొన్ని పార్టీ వర్గాలు కొన్ని విషయాలు బయపెట్టాయి. అవేమిటంటే నియోజకవర్గంలోని వివిధ పనులను, కాంట్రాక్టులను ఎంఎల్ఏలు తమ మద్దతుదారులకు ఇచ్చుకోవటం మామూలే. మద్దతుదారులు, కార్యకర్తలు బాగుంటేనే తాము బాగుంటామనే కాన్సెప్టు అందరి ఎంఎల్ఏల్లోను ఉండేదే. అయితే కనిగిరిలో మాత్రం అలాంటి వాటికి ఎంఎల్ఏ దూరంగా ఉంటున్నారట. ఎందుకంటే ప్రతి పనినీ, ప్రతి కాంట్రాక్టును తానే చేసుకుంటున్నారట.

స్వతహాగానే బిల్డర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన బుర్రా మద్దతుదరులకు లేదా కార్యకర్తలకు ఎటువంటి పనులు ఇప్పించటం లేదట. నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు వర్కులన్నింటినీ తన మనుషుల ద్వారా మొత్తం తానే తీసేసుకుంటున్నారట. కాంట్రాక్టులు అడిగిన మద్దతుదారులకు ఎంఎల్ఏ మొండి చెయ్యి చూపుతున్నారట. దాంతో ఎంతకాలం వెయిట్ చేసినా ఎంఎల్ఏ వైఖరిలో మార్పు రాకపోవటంతో మద్దతుదారులు, క్యాడర్ మొత్తం విసిగిపోయారట. దాంతో పార్టీలోని నేతలంతా బుర్రాకు వ్యతిరేకం అయిపోయాని సమాచారం. నియోజకవర్గంలో ట్యాంకర్లతో మంచినీటిని సరఫరా చేసే వ్యాపారం కూడా ఎంఎల్ఏనే సొంతంగా చూసుకుంటున్నారట.

మరి నియోజకవర్గంలోని నేతలతోను క్యాడర్ తోను సంబంధం లేకుండా వ్యవహరిస్తున్న ఎంఎల్ఏకి రాజకీయంగా భవిష్యత్తుపై పెద్దగా ఆశలు లేనట్లే ఉందనే అనుమానం పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదనో లేకపోతే వచ్చినా గెలిచే అవకాశాలు లేవనో అదీకాకపోతే అసలు పోటీ చేసే ఉద్దేశ్యంలోనో లేడనే ప్రచారం పెరిగిపోతోంది. ఎందుకంటే ఎంఎల్ఏ వ్యాపారాలకు బేస్ అంతా బెంగుళూరేనట. ఎక్కువ కాలం బెంగుళూరులో గడిపేస్తున్న బుర్ర ఏదో అవసరం ఉన్నపుడు చుట్టం చూపుగా నియోజకవర్గంలో కనబడుతున్నారట.

అవసరం అనుకున్నపుడు మాత్రమే కనిగిరిలో కనిపిస్తు మిగిలిన కాలమంతా తన సొంత మనుషులను పెట్టుకుని వ్యవహారాలను చక్కపెట్టేస్తున్నట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఎంఎల్ఏ వైఖరిపై జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డికి ఎన్ని ఫిర్యాదులు చేసినా ఉపయోగం కనబడటం లేదట. చివరకు అమరావతిలోని పార్టీలోని కీలక నేతలకు కూడా ఫిర్యాదులు అందాయట. మరి నియోజకవర్గంలో ఏమి జరుగుతోందో ఆరాతీసి పార్టీ నాయకత్వం పరిస్దితిని ఎప్పటికి చక్కదిద్దుతుందని నేతలు, క్యాడర్ ఎదురు చూస్తున్నారు. మరి ఆ రోజు ఎప్పటికి వస్తుందో ఏమో.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)