అభిమానించే వాళ్ళ నుండి జగన్ పై విమర్శలు మొదలయ్యాయా ?

జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళ నుండే విమర్శలు మొదలయ్యాయా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం-స్టేట్ ఎలక్షన్ కమీషన్ మధ్య అగాధం రోజురోజుకు పెరిగిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి మధ్య నడుస్తున్న లేఖల యుద్ధం ముదిరి పాకాన పడుతోంది. ఈ నేపధ్యంలో మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు చేసిన ట్వీట్ బాగా వైరల్ అవుతోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్నికల కమీషనర్ మరోక రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే విధంగా ప్రవర్తిస్తున్నారని కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో పొందుపరచిన అనుకరుణ ప్రకారం ఎన్నికల నిర్వహణ అధికారం ఎన్నికల కమీషనర్ దే అని స్పష్టం చేశారు. రాష్ట్రప్రభుత్వాన్ని సంప్రదించటం అంటే నిర్ణయం రాష్ట్రప్రభుత్వానికి అనికాదు అన్నారు.

రాజ్యాంగంలో అంత స్పష్టంగా ఉన్నపుడు రాష్ట్రప్రభుత్వం అడ్డుపడితే కోర్టులో ఈసారి అక్షింతలతోనే ఆగకపోవచ్చని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రప్రభుత్వ చర్యలు వివేక రహితంగా ఉన్నాయంటూ మాజీ ప్రధాన కార్యదర్శి తీవ్రంగా ఆక్షేపించారు. మొత్తానికి ప్రభుత్వం, ఎన్నికల కమీషనర్ వివాదం కోర్టు మెట్లెక్కితే ఏమవుతుందనే విషయాన్ని ఐవైఆర్ చూచాయగా హెచ్చరిచటం సంచలనంగా మారింది.

మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు కోరి ఇంతదాకా తెచ్చుకుంటోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. అసలు వివాదం మొదలవ్వటమే నిమ్మగడ్డ రాంగ్ స్టెప్ తో మొదలైందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వివాదాన్ని ఏదో ఓ చోట ఫులిస్టాప్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది. రెండు వ్యవస్ధల మధ్య ఘర్షణ పెరిగిపోతుండటంతో జగన్ ను అభిమానించే వాళ్ళు కూడా ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడలేకపోతున్నారు. మరి ఈ విషయంలో జగన్ ఓసారి పునరాలోచించుకుంటే బాగుంటుందేమో.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)