ఇది అసలే పోటీ ప్రపంచం. ఓ కంపెనీ తన రెండో యూనిట్ ను నెలకొల్పాలని అనుకుంటున్నట్లు బయటి ప్రపంచానికి తెలిసిందంటే… ఆ కంపెనీ ముందు పలు దేశాలు, ఆయా దేశాల్లోని పలు రాష్ట్రాలు వాలిపోతాయి. తమ పరిధిలో ఆ యూనిట్ ను ఏర్పాటు చేయాలంటే… కాదు మా పరిధిలో ఏర్పాటు చేయాలంటూ ఇంకో దేశమో, రాష్ట్రమో ప్రతిపాదిస్తాయి. ఈ క్రమంలో తమ పరిధిలో ఆ యూనిట్ ను ఏర్పాటు చేస్తే.. ప్రోత్సాహకాలు ఇస్తామంటూ ఒకదానిని మించి మరొకటి తాయిలాలు ప్రకటిస్తాయి. ఇందుకోసమే దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం లాంటి వేదికలు నిత్యం పనిచేస్తూనే ఉంటాయి. మరి ఏపీకి వస్తున్న కంపెనీలకు ప్రోత్సాహకాలను కూటమి సర్కారు ప్రకటిస్తే తప్పేంటి? ఈ విషయాన్ని కోర్టులు కూడా కరెక్టేనని తేల్చి చెప్పేదాకా కూడా విపక్షాలు, ఎన్జీవోలు యాగీ మానవా?
ఇప్పటికే వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏపీ పారిశ్రామికంగా బాగా వెనుకబడిపోయింది. అప్పటిదాకా చంద్రబాబు సర్కారు తీసుకువచ్చిన కంపెనీలను కూడా జగన్ సర్కారు తరిమికొట్టింది. ఇక కొత్త కంపెనీల మాటే వినిపించలేదు. అయితే తాజాగా మరోమారు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పురోభివృద్ధి బాట పట్టించేందుకు పక్కా ప్రణాళిక రచించారు. అందులో భాగంగా ఏపీకి వచ్చే కంపెనీలకు ఇతర రాష్ట్రాల మాదిరిగా ఆయా కంపెనీలకు ప్రోత్సాహకాలు పేర్కొంటూ నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. ఈ పారిశ్రామిక విధానం మేరకే ఆయా కంపెనీలకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. తాజాగా విశాఖలో నూతన యూనిట్ ను ప్రారంభించేందుకు ముందుకు వచ్చిన కాగ్నిజెంట్ కు 22 ఎకరాల భూమిని ఎకరాకు రూ.99 పైసలకు కేటాయించింది.
ఈ భూ కేటాయింపుపై విశాఖకే చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నేరుగా హైకోర్టుకు ఎక్కింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపిన హైకోర్టు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే ఏ కంపెనీ అయితే తన యూనిట్ ను ఏర్పాటు చేస్తుంది? అంటూ కోర్టు పిటిషనర్ ను ప్రశ్నించింది. ప్రోత్సాహకాలు ఇస్తామన్న విషయం కొత్తదేమీ కాదు కదా అంటూ కూడా కోర్టు ప్రశ్నించింది. అన్ని రాష్ట్రాలు, దేశాలు కూడా తమ వద్దకు వస్తున్న కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి కదా అని కూడా గుర్తు చేసింది. మొత్తంగా కూటమి సర్కారు కాగ్నిజెంట్ కు నామమాత్రపు ధరకు భూమిని కేటాయించడాన్ని సమర్థించింది.
పొరుగు రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తుంటే… ఆయా కంపెనీలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాయి. భూములను కూడా నామమాత్రపు ధరకే కేటాయిస్తున్నాయి. ఈ పద్ధతి ద్వారానే తెలంగాణ అయినా, కర్ణాటక అయినా, తమిళనాడు అయినా తమ రాష్ట్రాల్లో కంపెనీలను ఏర్పాటు చేసే సంస్థలకు భారీ ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఈ విషయంలో కర్ణాటక అయితే అందరి కంటే ముందు ఉంది అని చెప్పాలి. ఈ కారణంగానే ఐటీ రంగంలో దేశంలోనే నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. ఇక తెలంగాణ కూడా కర్ణాటక బాటలోనే సాగుతూ భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates