పులివెందుల పోరు: బాల‌య్య ఫ‌స్ట్ రియాక్ష‌న్‌

పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక‌ల్లో టీడీపీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంది. ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ ర‌వి(మారెడ్డి ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి) స‌తీమ‌ణి మారెడ్డి ల‌త ఇక్క‌డ పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆమెకు ఏకంగా 6 వేల పైచిలుకు ఓట్లు ప‌డ్డాయి. అంతేకాదు.. వైసీపీ త‌ర‌ఫున పోటీలో ఉన్న హేమంత్‌కుమార్ రెడ్డి డిపాజిట్‌(రూ.2500) కోల్పోయారు. ఈ ప‌రిణామాల‌పై అధికార పార్టీలో హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వ‌ర‌కు కూడా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టికే ల‌త‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఇక‌, ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం ప‌ట్ల హిందూపురం ఎమ్మెల్యే, న‌ట‌సింహం బాల‌కృష్ణ స్పందించారు. పులివెందుల ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ప్ర‌జాస్వామ్యానికి పెద్ద‌పీట వేశార‌ని అన్నారు. స్వేచ్ఛావాయువులు పీల్చార‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు నిరంకుశంగా వ్య‌వ‌హ‌రించిన వారికి త‌గిన బుద్ధి చెప్పార‌ని వ్యాఖ్యానించారు. గ‌తంలో నామినేష‌న్ వేసేందుకు కూడా భ‌య‌ప‌డిన నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌భుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌లు, గ‌ట్టి భ‌ద్ర‌త క‌ల్పించ‌డంతో ఎక్కువ మంది నామినేష‌న్లు దాఖ‌లు చేశార‌ని అన్నారు. ఈ విజ‌యం ప్ర‌తి ఒక్క కార్య‌క‌ర్త‌దీ అని బాల‌య్య పేర్కొన్నారు.

మ‌రోవైపు మంత్రి ప‌య్యావుల కేశ‌వ్‌, మంత్రి స‌విత‌లు స్పందిస్తూ.. ప్ర‌జాస్వామ్యంలో ఓటు హ‌క్కు ఎంత విలువైందో చెప్ప‌డానికి పులివెందులే సాక్ష్య‌మ‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల‌ను నిలువ‌రించేందుకు.. ఓటు వేయ‌కుండా అడ్డుకునేందుకు వైసీపీ చేసిన కుటిల ప్ర‌య‌త్నాలను ప్ర‌జ‌లే తిర‌స్క‌రించి.. ధైర్యంగా ముందుకు వ‌చ్చి ఓటేశార‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. మూడు ద‌శాబ్దాల త‌ర్వాత పులివెందుల‌లో ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌జ‌లు ప‌ట్టంక‌ట్టార‌ని మంత్రులు సంతోషం వ్య‌క్తం చేశారు. ప్ర‌జాస్వామ్య బ‌ద్ధంగా ఎన్నిక‌లు జ‌రిగితే టీడీపీదే విజ‌యం అని చెప్పేందుకు ఈ ఎన్నిక‌లు ఉదాహ‌ర‌ణ‌గా మ‌రో మంత్రి మండ‌ప‌ల్లి రాం ప్ర‌సాద్ రెడ్డి చెప్పారు.

ఇక‌, బీజేపీకి చెందిన మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ స్పందిస్తూ.. జ‌గ‌న్ ఇప్ప‌టికైనా తెలుసుకోవాల‌న్నారు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌ల‌ను మించిన దేవుళ్లు లేర‌ని.. పులివెందుల‌లో జ‌గ‌న్ టీం అరాచ‌కాల‌కు బుద్ధి చెప్పార‌ని వ్యాఖ్యానించారు. ఇక‌నైనా జ‌గ‌న్ ప్ర‌జ‌ల విష‌యంలో ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాల‌న్నారు. ప్ర‌జాతీ ర్పుపై విమ‌ర్శ‌లు చేయ‌డం మానుకోవాల‌న్నారు. ప్ర‌జ‌ల తీర్పును గౌర‌వించ‌లేనప్పుడు పార్టీని మూసేసుకుని ఇంటికే ప‌రిమితం కావాల‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.