జగన్ కు తెలంగాణ ఎంపీ ఇచ్చిపడేశారు!

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు హాట్ లైన్ లో ఉంటారంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఇటు టీడీపీ నేతలతో పాటు అటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. కౌంటర్లు ఇవ్వడంలో ఓ రేంజి స్పీడు చూపించే టీ కాంగ్ నేత, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.. జగన్ కు ఇచ్చిపడేశారనే చెప్పాలి. రాహుల్ ను గానీ, రేవంత్ ను గానీ విమర్శించే అర్హతే జగన్ కు లేదంటూ జగన్ కు గట్టిగా బదులిచ్చారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పార్టీ ఓడిపోయింది ప్రదాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాల వల్లేనని కిరణ్ చెప్పుకొచ్చారు. ఈ లెక్కన తన పార్టీ ఓటమిపై జగన్ ఏదైనా విమర్శ చేయాలనుకుంటే… మోదీ, షాలను విమర్శించాలని ఆయన సూచించారు. అంతటితో ఆగని కిరణ్… అయినా మోదీ, షాలతో పాటు ఏ ఒక్క బీజేపీ నేతను కూడా విమర్శించే దమ్ము జగన్ కు లేదని కూడా తేల్చి పారేశారు. ఎందుకంటే… ఎక్కడ తనపై ఉన్న కేసులను మోదీ, షాలు తిరగదోడతారోననే భయం జగన్ ను నిత్యం వెంటాడుతూనే ఉందని కిరణ్ తెలిపారు.

అక్కడితో కూడా ఆగని కిరణ్… 2024 సార్వత్రిక ఎన్నికల దాకా బాగానే ఉన్న జగన్… ఆ ఎన్నికల్లో ఓటమి దక్కగానే విచిత్రంగా మారిపోయారని వ్యాఖ్యానించారు. ఓటమి తర్వాత జగన్ ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదని కూడా ఆయన ఎద్దేవా చేశారు. ఈ తరహా విచిత్ర వైఖరి కలిగిన రాజకీయ నేతలను తాను ఇప్పటిదాకా చూడలేదని ఆయన అన్నారు. వాస్తవాలను జగన్ ఇప్పటికైనా తెలుసుకుని మసలుకోవాలని, అనవసరంగా తమ నేతలపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని కిరణ్ హెచ్చరించారు.