భ్రష్టుపట్టిపోయిన రాజకీయాల్ని మార్చేయాలని.. మార్చేస్తామని చాలామంది వినూత్న మార్గాల్లో ప్రయత్నించి విఫలమైన వాళ్లే. గత కొన్ని దశాబ్దాల్లో కొత్త తరహా రాజకీయం అంటూ వచ్చిన పార్టీల్లో ఆమ్ ఆద్మీ మినహాయిస్తే ఏదీ నిలబడలేదు. ఆ పార్టీ కూడా అర్బన్ ఓటర్స్ ఎక్కువగా ఉన్న ఢిల్లీలో మాత్రమే విజయవంతమైంది.
కొన్నిసార్లు సంప్రదాయ రాజకీయాల్ని అనుసరించినప్పటికీ ఉన్నంతలో ఆ పార్టీలకు భిన్నంగానే కనిపిస్తోంది ఆమ్ ఆద్మీ. ఐతే ఆమ్ ఆద్మీ తరహాలో రాజకీయాల్ని ప్రక్షాళన చేద్దామని వచ్చిన లోక్ సత్తా, జనసేన లాంటి పార్టీలకు చేదు అనుభవమే ఎదురైంది. జయప్రకాష్ నారాయణ పార్టీ సోదిలోనే లేకుండా పోగా.. పవన్ కళ్యాణ్ పార్టీ కూడా విఫలబాటలోనే పయనిస్తోంది. దాని భవితవ్యం ఏంటో వచ్చే ఎన్నికలు నిర్దేశిస్తాయి. కాగా కన్నడనాట ఇప్పుడు సంచలన విధానాలతో ఓ కొత్త పార్టీ ఆవిర్భవించింది. దాని పేరు.. ప్రజాకీయ పార్టీ.
కన్నడ సూపర్ స్టార్లలో ఒకడైన ఉపేంద్ర మొదలుపెట్టిన పార్టీ ఇది. ఇంతకుముందే రాజకీయాల్లోకి అడుగు పెట్టి కొత్త పార్టీని ప్రకటించాడు ఉపేంద్ర. కానీ ఆ పార్టీలోని వ్యక్తులే వెన్నుపోటు పొడవడంతో దాన్ని విడిచిపెట్టి బయటికి వచ్చేశాడు. ఇప్పుడు కొత్తగా మళ్లీ పార్టీ పెట్టాడు. దీని విధానాలు చూసి అందరూ షాకైపోతున్నారు. ఈ పార్టీకి ఎవ్వరూ నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదట. అలాగే దీనికి కార్యకర్తలంటూ ఎవరూ ఉండరట. ప్రాంతీయ పార్టీ ఆఫీసులు ఉండవట. ర్యాలీలు, బేనర్లు, సమావేశాలు లాంటివే పెట్టకూడదట. వేరే పార్టీల మీద నిందలేయడం, అబద్ధపు హామీలివ్వడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం, సామాజిక సేవా కార్యక్రమాల పేరుతో డ్రామాలు చేయడం.. ఇవేవీ ఈ పార్టీలో ఉండవట. ఐతే ఇలాంటి ఆదర్శాలు రాసుకోవడానికి, చదువుకోవడానికి బాగుంటాయి కానీ.. ఈ రోజుల్లో ఇలా రాజకీయం చేయడం మాత్రం దాదాపు అసాధ్యమైన విషయమే. మరి ఈ మార్గంలో రాజకీయం చేసి ఉపేంద్ర ఏమేరకు విజయవంతం అవుతాడో చూడాలి.