జగన్ మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తిరుమలలో రాజకీయ చిందులు తొక్కారు. తిరుమల పవిత్రతకు ఓ నాయకుడిగా పెద్దపీట వేయాల్సిన ఆయన, టీడీపీని, కూటమి ప్రభుత్వాన్ని తిడుతూ, తిరుమల శ్రీవారి ఆలయం ముందే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఆయన విమర్శలు గుప్పించారు. వాస్తవానికి తిరుమలలో రాజకీయ విమర్శలు చేయొద్దంటూ పాలక మండలి కొన్ని వారాల కిందట తీర్మానం చేసింది.
దీనిపై బహిరంగ ప్రకటన కూడా చేసింది. తిరుమలకు వచ్చే నేతలు ఎలాంటి విమర్శలు చేయొద్దని కూడా టీటీడీ బోర్డు ప్రకటించింది. అయితే కొందరు నాయకులు సైలెంట్‌గా ఉంటే, మరికొందరు రాజకీయ విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే అందరినీ మించి రవీంద్రనాథ్ రెడ్డి చిందులు తొక్కారు. సీఎం చంద్రబాబుపైనా, కూటమి ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు. పులివెందులలో అరాచకాలకు సీఎం శ్రీకారం చుట్టారని, రాజకీయ ఉన్మాదం ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు.
పులివెందులలో రాజకీయాలను నీచంగా మార్చేస్తున్నారని, జెడ్పీటీసీ ఎన్నికలకు గతంలో ఎప్పుడూ నోటిఫికేషన్ ఇవ్వలేదని, తొలిసారి నోటిఫికేషన్ ఇచ్చారని, దీనిని కూడా చంద్రబాబు నేతృత్వంలోనే ఇచ్చారని అన్నారు. హత్యలు చేస్తున్నారని, వైసీపీ నాయకులపై దాడులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తిరుమలలో వ్యాఖ్యానించారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా రవీంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీటీడీ సీరియస్ అయింది. ఆయనపై బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు తిరుమల పాలక మండలి చేసిన తీర్మానంలోని నిబంధనలను ఉల్లంఘించిన నేరంపై రవీంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదు చేయనున్నట్టు చెప్పారు. అయితే ముందుగా ఆయన నుంచి వివరణ తీసుకుంటామని తెలిపారు. వాస్తవానికి తిరుమలలో ఒకప్పుడు ఉన్న రాజకీయాలను తగ్గించేందుకు ప్రస్తుత బోర్డు ప్రయత్నాలు చేస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates