సాధారణంగా రాజకీయాల్లో ఉన్న వారు తమ వారసుల కోసం ఎంతో ప్రయత్నం చేస్తారు. వారసులు వస్తే రాజకీయాలు కొనసాగుతాయని, తమ హవా నిలబడుతుందని కూడా అంచనా వేసుకుంటారు. ప్రస్తుత మంత్రులుగా ఉన్నవారిలో టీజీ భరత్ వారసత్వంగానే రాజకీయాల్లోకి వచ్చారు. మంత్రి అయ్యారు. ఇక ఎమ్మెల్యేల్లోనూ పదుల సంఖ్యలో వారసులు ఉన్నారు. అయితే రాను రాను వీరి సంఖ్య పెరుగుతుందని భావించేవారు కూడా ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి సగానికి పైగా నియోజకవర్గాల్లో వారసులు పెరుగుతారని అనుకున్నారు.
కానీ ఇది ప్రచారం మాత్రమేనని తేలిపోయింది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారు, ఎమ్మెల్యేలుగా ఉన్న సీనియర్ నాయకులు కూడా తమ పిల్లలను రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు వెనుకాడుతున్నారు. “వద్దులే అబ్బా.. రాజకీయాలు బాలేవు” అని సీమకు చెందిన ఓ మంత్రి తన వారసుడి రాజకీయాలపై వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న ఈయన, తన కుమారుడి విషయంపై మీడియాతో చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఈయన ఒక్కడే కాదు, సీనియర్లుగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇదే చెబుతున్నారు.
కొన్నాళ్ల కిందటివరకు గంటా శ్రీనివాసరావు, మంత్రి నారాయణ కూడా తమ పిల్లలను రాజకీయాల్లోకి తీసుకురావాలని భావించారు. నారాయణకు ఇద్దరూ ఆడపిల్లలే. దీంతో ఆయన సతీమణి రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపించారు. కానీ నారాయణ ఆమెను కూడా వద్దు అని చెప్పి నియోజకవర్గానికే పరిమితం చేశారు. ఇక గంటా కుటుంబం నుంచి వారసుడి అరంగేట్రంపై ఎదురు చూస్తున్న సమయంలో ఆయన కూడా తమ వాడితో వ్యాపారం చేయిస్తానని చెప్పడం గమనార్హం.
విజయవాడ సెంట్రల్‌లో ఎమ్మెల్యే బొండా ఉమా తన ఇద్దరు పిల్లలను రాజకీయాల్లోకి తీసుకురావాలని కలలు కన్నారు. కానీ ఇటీవల వారిని పక్కన పెట్టి, ఫ్లెక్సీల్లో వారి ఫొటోలు ఇక నుంచి వేయొద్దని ఆదేశించారు. వైసీపీలోనూ ఇలాంటి నాయకులు పెరుగుతున్నారు. ఒకప్పుడు వారసత్వానికి పెద్ద పీట వేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వచ్చే ఎన్నికల్లో తన కుటుంబం నుంచి ఎవరో ఒక్కరే పోటీలో ఉంటారని చెబుతున్నారు. దీనికి ఆయన కూడా అదే కారణం చెప్పారు — పాలిటిక్స్ బాలేవు.
అయితే అసలు పాలిటిక్స్ బాలేవు అనే స్థితికి తీసుకువచ్చింది మీరే కదా..! అన్నది వారసుల టాక్. ఏదేమైనా, వచ్చే ఎన్నికల నాటికి వారసుల సంఖ్య తగ్గే అవకాశం కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates