రాజకీయాల్లో సెంటిమెంట్లకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతాకాదు. అయితే.. ఈ సెంటిమెంటు వ్యవహారం ఒక్కొక్క పార్టీకి, ఒక్కొక్క నేతకు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ విషయంలో టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్.. మరో అడుగు ముందుకు వేశారు. శనివారం రాఖీ పండుగను పురస్కరించుకుని ఆయన మంగళగిరి కార్యాలయంలోనే అందుబాటులో ఉన్నారు. వాస్తవానికి సీఎం చంద్రబాబు వెంట ఆయన కూడా.. మన్యం జిల్లాకు వెళ్లి.. జన జాతీయ ఆదివాసీ దినోత్సవంలో పాలు పంచుకోవాల్సి ఉంది.
కానీ, రాఖీ పండుగతో నారా లోకేష్.. మంగళగిరి కార్యాలయంలోనే ఉన్నారు. ఈ సందర్భంగా మంగళగిరి నుంచి వచ్చిన మహిళలతో ఆయన రాఖీ కట్టుకున్నారు. అనంతరం వారికి మంగళగిరి చేనేత చీరలను కానుకగా అందించారు. అయితే.. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తనకు తోబుట్టువులంటూ.. ఎవరూ లేరని.. తాను ఒక్కడినేనని, కానీ, గత ఎన్నికల్లో తనను మనసులో పెట్టుకుని దీవించి అఖండ మెజారిటీతో గెలిపించిన మంగళగిరి మహిళలందరూ తనకు అక్కా చెల్లెళ్లతో సమానమని వ్యాఖ్యానించారు.
ఈ ఒక్క వ్యాఖ్య.. మంగళగిరి మహిళల మనసు దోచుకునేలా చేసింది. సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ అయిన తర్వాత.. మరింత మంది మహిళలు పార్టీ కార్యాలయానికి చేరుకుని నారా లోకేష్‌కు రాఖీ కట్టేందుకు క్యూలో నిలబడ్డారు. వాస్తవానికి.. గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా మంగళగిరి ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్నారు. కానీ, ఆయన ఎప్పుడూ.. ఇంతగా ఇక్కడివారిని ఓన్ చేసుకోలేకపోయారు. ఎమ్మెల్యే అంటే.. ఎమ్మెల్యేగా మాత్రమే వ్యవహరించారు. దీనికి భిన్నంగా నారా లోకేష్ మంగళగిరి ప్రజలను ఓన్ చేసుకోవడం.. ఇక్కడి మహిళలను తన సొంత తోబుట్టువులుగా పేర్కొనడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates