“నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. రూపాయి లేక.. ఇబ్బందులు పడుతున్నాం. కొంచెం కరుణిం చండి.” అంటూ.. తాజాగా పలువురు ఎమ్మెల్యేలు సీఎంవో అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏపీలోని ప్రతినియోజకవర్గంలోనూ అభివృద్ది చేసేందుకు నిధులు ఇస్తామని.. గత ఏడాది తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే .. సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత.. కొన్నాళ్లపాటు మౌనంగా ఉన్నారు. ఇక, గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా చేపట్టింది. దీనికి కేంద్రం నుంచి వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులను వెచ్చించారు.
ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా కొన్నాళ్ల కిందటే చెప్పుకొచ్చారు. అయితే.. కీలకమైన అసెంబ్లీ నియోజక వర్గాల పనులకు ఎమ్మెల్యేలకు నిధులు దక్కడం లేదన్నది వాస్తవం. కారణాలు ఏవైనా నిధుల కొరతతో ఎమ్మెల్యలు ఇక్కట్లు పడుతున్నారు. అయితే.. కొందరు ఎన్నారైలతో నేరుగా సంబంధాలు ఉన్నవారు, పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్లతో సంబంధాలు ఉన్న నాయకులు మాత్రం.. వారి నుంచి కార్పొరేట్ రెస్పాన్స్ పథకం కింద.. నిధులు తీసుకుని పనులు చేయిస్తున్నారు. మరికొందరు సొంతగానే కొంత మేరకు సొమ్ములు వెచ్చించి.. పనులు చేస్తున్నారు. కానీ.. ప్రభుత్వం పరంగా మాత్రం నేరుగా నియోజకవర్గాలకు నిధులు చేరడం లేదు.
మరోవైపు.. ప్రభుత్వం జిల్లాల అభివృద్ధికి కేటాయించిన నిధులపై పూర్తిస్థాయిలో కలెక్టర్లకే పెత్తనం అప్పగించింది. వారి ఖాతాల్లో నే నిధులు జమ చేస్తోంది. దీంతో నియోజకవర్గాల్లో చిన్నపాటి పనులు అంటే.. రూ.10 లక్షల విలువైన పనులు చేపట్టాలన్నా.. ఎమ్మెల్యేలు కలెక్టర్ల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయినా.. కొన్నిచోట్ల కొంత మేరకు నిధులు కేటాయిస్తున్నా.. మరికొన్ని నియోజకవర్గాల్లో మాత్రం చూస్తాం.. చేస్తాం.. అంటూ కలెక్టర్లు కాలయాపన చేస్తున్నారు. ఈ పరిణామాలతో ఎమ్మెల్యే ఒకింత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నది నిజం. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం కింద ప్రజల మధ్యకు వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు వెళ్తే.. వారు ఇదే విషయాన్ని చెబుతున్నారు. తమ నియోజకవర్గంలో పనులు చేయడం లేదని అంటున్నారు. వాస్తవానికి ఈ దుస్థితి వైసీపీ హయాంలోనూ నెలకొంది. నియోజకవర్గానికి ఏటా కోటి రూపాయలు అభివృద్ధినిధులు ఇస్తామన్న అప్పటి సీఎం జగన్.. తర్వాత.. దీనిపై నోరెత్తలేదు. వచ్చిన సొమ్ము , అప్పుగా తెచ్చిన సొమ్మును కూడా సంక్షేమానికి ఖర్చు చేయాల్సి వచ్చిందని ఎమ్మెల్యేలకు చెప్పకొచ్చారు. దీంతో అప్పుడు కూడా నియోజకవర్గాల్లో పనులు చేపట్టలేక పోయారు. ఇక, ఇప్పుడైనా తమకు నిధులు ఇవ్వాలన్నది ఎమ్మెల్యేలు కోరుతున్న మాట. మరి బాబు ఏమేరకు వినిపించుకుంటారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates