ఏడాది దాటింది.. జ‌న‌సేన ‘రివ్యూ’ చేసిందా ..!

అధికారంలోకి వ‌చ్చిన పార్టీకి ఎప్ప‌టిక‌ప్పుడు రివ్యూ అవ‌స‌రం. ఎందుకంటే.. త‌ప్పులు ఎక్క‌డైనా జ‌రుగుతుంటే.. వాటిని స‌రిదిద్దుకునేందుకు.. నాయ‌కుల‌ను లైన్‌లో పెట్టుకుని ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ అయ్యేందుకు ఈ రివ్యూ దోహ‌ద ప‌డుతుంది. అందుకే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌ర‌చుగా రివ్యూలు చేస్తారు. ఐవీఆర్ఎస్ స‌హా.. ఇత‌ర మాధ్య‌మాల్లో ప్ర‌జ‌ల నుంచి కూడా పార్టీ నేత‌ల‌పై అభిప్రాయాలు తెలుసుకుంటారు. త‌ద్వారా త‌ప్పులు జ‌రిగిన చోట స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేస్తారు. దీనిని కొంద‌రు అతి.. అని భావించినా.. చంద్ర‌బాబు ఎప్పుడూ వెన‌క్కి త‌గ్గ‌లేదు.

అంతేకాదు.. వైసీపీ ఇలా రివ్యూ చేయ‌క‌పోవ‌డం.. చేసినా.. త‌ప్పులు చేసిన నాయ‌కుల విష‌యంలో ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోని ఫ‌లితంగా పార్టీ విఫ‌ల‌మైంది. అనేక మంది నాయ‌కుల‌ను ఎన్నిక‌ల ముందు త‌ప్పించినా.. ప్ర‌యోజ‌నం క‌నిపించ‌కుండాపోయింది. ఇక‌, భ‌విష్య‌త్తులో మ‌రింత ఎత్తుకు ఎద‌గాల‌ని భావిస్తున్న జ‌న‌సేన ప‌రిస్థితి ఏంటి? ఎలా ముందుకు సాగాలి? అనే విష‌యాల‌ను ల‌క్ష్యంగా పెట్టుకున్న ఆ పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ కు కూడా.. రివ్యూలు చాలా ముఖ్యం. ఏడాది పాల‌న‌లో జ‌న‌సేన నేత‌ల ప‌నితీరు ఎలా ఉంద‌న్న‌ది అంచ‌నా వేసుకోవాల్సి ఉంది.

అయితే.. ఈ త‌ర‌హా ప‌రిస్థితి.. రివ్యూ సంస్కృతి జ‌న‌సేన‌లో క‌నిపించ‌డం లేదు. స‌ర్వంస‌హా.. త‌నే పార్టీకి అన్నీ అనుకుంటున్నారా? అనే సందేహాలు కూడా వ‌స్తున్నాయి. నిజానికి ఎంత ఇమేజ్ ఉన్నా.. అన్ని సంద‌ర్భాల్లోనూ వ‌ర్క‌వుట్ కాదు. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు పార్టీని భ్ర‌ష్టు ప‌ట్టిస్తే.. అధినేత ఉన్నా.. ఏం చేయ‌లేని ప‌రిస్థితి గ‌తంలో ఎన్టీఆర్ విష‌యంలోనూ క‌నిపించింది. ప్ర‌స్తుతం జ‌న‌సేన విష‌యంలోనూ రివ్యూ లేక‌పోతే.. అదే ప‌రిస్థితి ఎదుర‌య్యే ప్ర‌భావం .. ప్ర‌మాదం కూడా పొంచి ఉన్నాయి.

వాస్త‌వానికి.. కొన్నికొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పోల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. తాడేప‌ల్లిగూడెం, నెల్లిమ‌ర్ల, తిరుప‌తి స‌హా.. మ‌రో రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. మ‌రి అక్క‌డ ఏంజ‌రుగుతోంద‌న్న‌ది పార్టీ అధినేత ఆరా తీయాల్సిన అవ‌స‌రం ఉంది. అదేవిధంగాఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌పైనా దృష్టి పెట్టి.. స‌మీక్ష‌లు చేసుకుని.. త‌ప్పులు జ‌రుగుతున్న చోట‌.. స‌రిదిద్దుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. మ‌రి ఇప్పటి వ‌రకు ఈ త‌ర‌హా ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు. మ‌రి ఇప్పుడైనా క‌దులుతారో లేదో చూడాలి.