అమ‌రావ‌తికి రియ‌ల్ ఎస్టేట్ బూమ్‌… !

అమరావతి రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ మళ్లీ పుంజుకుంది. 2014 -2019 మధ్య భారీ ఎత్తున అమరావతి రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు భారీగానే సాగాయి. పెద్ద ఎత్తున వెంచర్లు కూడా పడ్డాయి. అంతేకాదు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేకమంది వచ్చి ఇక్కడ భూములు కొనుగోలు చేయాలని భావించారు. అలాగే వెంచర్లలో ఫ్లాట్లను కూడా కొనుగోలు చేశారు. దీంతో అప్పట్లో రియల్ ఎస్టేట్ భారీ స్థాయిలో ముందుకు సాగింది. ఇది పొరుగు రాష్ట్రాలకు కూడా పోటీగా మారింది. అయితే 2019 ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో రాజధాని ప్రాంతం పై తీవ్ర ప్రభావం పడింది.

వాస్తవానికి జగన్ వచ్చిన తర్వాత అమరావతి రాజధానిని తనదైన శైలిలో ముందుకు నడిపిస్తారని, అద్భుతంగా కడతారని చాలామంది ఆశలు పెట్టుకున్నారు. అనూహ్యంగా జగన్ 2020లో మూడు రాజధానులు ప్రతిపాదన చేయడంతో ఒక్కసారిగా అమరావతిలో రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఆ తర్వాత వ్యాపార వర్గాలన్నీ హైదరాబాదును ఎంచుకోవడం అక్కడి ప్రభుత్వం కూడా వ్యాపారులను స్వాగ‌తించటం అందరికీ తెలిసిందే. అంతే కాదు ‘ఏపీలో జగన్ ఉంటే తమ వ్యాపారాలు బాగుంటాయని’ తెలంగాణ పాలకులు సైతం అప్పట్లో చెప్పుకొచ్చారు.

ఇలా రియల్ ఎస్టేట్ రంగం గత ఐదు సంవత్సరాలలో భారీగా దెబ్బతింది. తర్వాత గత ఏడాది జరిగిన ఎన్నికల అనంతరం రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ హైదరాబాదులో ఇస్తున్న రాయితీలు, విస్తృతమైన అవకాశాలు, మెట్రో ప్రాజెక్టులు వంటివి వ్యాపారులను అక్కడే ఉండేలా హైదరాబాద్‌నే ఆకర్షించేలా చేశాయి. దీంతో అమరావతిలో అనుకున్న విధంగా తొలి ఏడాది అడుగులు పడలేదు. దీనిపై దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు విస్తృతమైన ప్రాజెక్టులు సాధించే దిశగా అమరావతిని విస్తరించే దిశగా వేసిన అడుగులు ప్రస్తుతం ఫలించారు.

ఇప్పుడు అమరావతిలో ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వెంచర్లు భారీ ఎత్తున కనిపిస్తున్నాయి. అంతేకాదు హైదరాబాద్, చెన్నై సహా గోదావరి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యాపారులు ఇక్కడికి వచ్చి భూములు కొనుగోలు చేయటం, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసేందుకు సిద్ధమవుతుండడం వంటివి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తుళ్లూరు, వెంకటాయపాలెం, మంగళగిరి ప్రాంతాల పరిధిలో రోజు కనీసం 20 నుంచి 30 రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు జరుగుతున్నట్టు అధికార వర్గాలే చెబుతున్నాయి. సో మొత్తానికి తొలి ఏడాది కొంత చప్పగా సాగిన ప్రస్తుతం అమరావతి రాజధానిలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుందనేది స్పష్టంగా కనిపిస్తోంది.