132 సార్లు కేసీఆర్ ప్ర‌స్తావ‌న‌.. పీసీ ఘోష్ నివేదిక‌పై చ‌ర్చ‌

కాళేశ్వ‌రం ప్రాజెక్టు వ్య‌వ‌హారంపై నియ‌మితులైన జ‌స్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక‌పై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రి మండ‌లి సుదీర్ఘంగా చ‌ర్చించింది. అంతేకాదు.. ఈ క‌మిష‌న్‌ నివేదిక‌ను సంక్షిప్తీక‌రించి.. మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం ఇచ్చిన నివేదిక‌పైనా చ‌ర్చించింది. పీసీ ఘోష్ క‌మిష‌న్ 620 పేజీల‌తోకూడిన నివేదిక‌ను నాలుగు రోజుల కింద‌ట ప్ర‌భుత్వానికి అందించిం ది. దీనిలో కీల‌క‌మైన అంశాల‌ను క్రోడీక‌రించిన మంత్రివర్గ ఉప‌సంఘం 62 పేజీల‌కు కుదించింది. అయితే.. పీసీ ఘోష్ క‌మిష‌న్ మాజీ సీఎం కేసీఆర్ పేరును 132 చోట్ల ప్ర‌స్తావించింది.

అయితే.. దీనిని కుదించిన మంత్రి వ‌ర్గ ఉప సంఘం తాము ఇచ్చిన సంక్షిప్త నివేదిక‌లోనూ.. 32 చోట్ల మాజీ సీఎం కేసీఆర్ పేరును పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా అప్ప‌టి జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి హ‌రీష్‌రావు పేరును 19 చోట్ల‌, ఈట‌ల రాజేంద‌ర్ పేరును 5 చోట్ల ప్ర‌స్తావించారు. మొత్తంగా ఈ నివేదిక‌పై మంత్రి వ‌ర్గం 4 గంట‌ల పాటు చ‌ర్చించింది. నివేదికను య‌థాత‌థంగా అమ‌లు చేయ‌డ‌మా? లేక‌.. దీనిపై ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయ‌డ‌మా? అనే విష‌యాల‌పై సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తుత జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. పీసీ ఘోష్ క‌మిష‌న్ నివేదిక స‌హా.. మంత్రి వ‌ర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక‌లోని అంశాల‌ను.. ప‌వ‌ర్ పాయింట్ ప్రెజంటేష‌న్ ద్వారా సీఎం స‌హా మంత్రుల‌కు స‌మ‌గ్రంగా వివ‌రించారు. త‌ప్పులు ఎక్క‌డ జ‌రిగాయి? ఏయే అంశాల‌ను అప్ప‌టి ప్ర‌భుత్వం విస్మ‌రించింది? అప్ప‌టి కేబినెట్‌లో తీసుకున్న నిర్ణ‌యాలు ఏంటి? అప్ప‌టి సీఎంగా కేసీఆర్ నిర్ణ‌యాలు.. ఇలా అన్ని అంశాల‌పైనా మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వివ‌రించారు. ప్ర‌ధానంగా.. క‌మిష‌న్ వెల్ల‌డించిన‌.. కేసీఆర్ ఇష్టానుసారంగానే.. కాళేశ్వ‌రం ప్రాజెక్టును డిజైన్ చేశార‌న్న వాద‌న‌పై మంత్రివ‌ర్గం దృష్టి పెట్టింది.

అయితే.. అధ్య‌య‌న క‌మిటీ(మంత్రివ‌ర్గ ఉప‌సంఘం) ఇచ్చిన సంక్షిప్త నివేదిక‌ను ప్రామాణికంగా తీసుకోవాల‌ని నిర్ణ‌యించారు. దీని ప్ర‌కారం.. సిట్ వేసి.. మ‌రింత లోతుగా చ‌ట్టంప్ర‌కారం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న విష‌యంపై చ‌ర్చించాల‌ని భావించారు. అయితే.. ఇప్ప‌టికిప్పుడు తుది నిర్ణ‌యానికి రాకుండా.. నివేదిక‌పై సిట్ అధికారుల‌ను నియ‌మించి.. వారి ద్వారా విచార‌ణ‌ను ప్రారంభించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది. ఏం చేసినా.. చ‌ట్టం, న్యాయ ప‌రిధిలోనే ఉండాల‌ని.. ప్ర‌భుత్వం బ‌ద్నాం కాకుండా.. ముందుకు సాగాల‌ని ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన‌ట్టు తెలిసింది.