టీడీపీ యువ నాయకుడు.. మంత్రి నారా లోకేష్ చైర్మన్‌గా `పెట్టుబడుల భాగస్వామ్య` కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నవంబరు 14, 15 తేదీల్లో.. విశాఖపట్నం కేంద్రంగా పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పరిశ్రమల అధిపతులు, ఐటీ దిగ్గజాలతోపాటు.. మరింత మంది పెట్టుబడి దారులను ఆకర్షించాలనే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. వచ్చే నాలుగేళ్లలో 50 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాలనేది ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం.
దీనిలో భాగంగా ఇప్పటి వరకు 12 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించారు. ఇలా.. వచ్చే నాలుగేళ్లలో ఏటా 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించేందుకు ఈ సదస్సును వేదికగా చేసుకోనున్నారు. ఈ సదస్సును నిర్వహించేందుకు ప్రత్యేకంగా మంత్రులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీకి చైర్మన్‌గా మంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తారు. సభ్యులుగా.. మంత్రులు గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, పి. నారాయణ, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్ ఉంటారు. వీరంతా పెట్టుబడి దారులను సమన్వయం చేయడంతోపాటు.. రెండు రోజుల సదస్సును విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తారు.
ఇదేసమయంలో ఈ సదస్సుకు వచ్చేవారికి ఏర్పాట్లు చేసేందుకు, భోజన వసతి సదుపాయం కల్పించేందుకు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. వీరు సదస్సుకు వచ్చేవారు.. తిరిగి వెళ్లే వరకు కూడా.. ఏర్పాట్లు చేస్తారు. వీరిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. పరిశ్రమల శాఖ సహా.. ఇతర శాఖల అధిపతులు ఇతర సభ్యులుగా ఉంటారు. ఈ రెండు రోజుల సదస్సుకు.. ప్రపంచ దేశాల నుంచి సుమారు 230 మంది ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, ఐటీ రంగానికి చెందిన వారు కూడా వస్తారని ప్రభుత్వం పేర్కొంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates