పార్లమెంటు ఉభయ సభలనూ కుదిపేస్తున్న కీలక అంశం… ఆపరేషన్ సిందూర్. ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గాంలో ఉగ్రవాదులు చెలరేగిపోయి.. పర్యాటకులపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. పేర్లు, ఊర్లు అడిగి మరీ పర్యాటకులను హత మార్చారు. నేపాల్ పౌరుడు సహా ఈ ఘటనలో 26 మంది చనిపోయారు. వీరిలో ఏపీకి చెందిన వారు కూడా ఉన్నారు. అయితే.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల క్రమంలో కేంద్రం.. పాకిస్థాన్‌పై కన్రెర్ర చేసింది. పాక్‌లోని ఉగ్రవాదులు, వారి స్థావరాలే లక్ష్యంగా `ఆపరేషన్ సిందూర్` పేరుతో దాడులు చేసింది.
మే 7వ తేదీ నుంచి వరుసగా నాలుగు రోజులు జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో భారత్ పైచేయి సాధించింది. అయితే.. అనూహ్యం గా దీనిని ఆపివేస్తూ.. నిర్ణయం తీసుకున్నారు. దీనికి తానే కారణమని.. తను చెప్పబట్టే పాక్, భారత్ రెండు దేశాలు ఆపరేషన్ సిందూర్‌ను ఆపేశాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాలు ప్రకటించడానికి ముందే.. ఆయన సామాజిక మాధ్యమం ట్రూత్ లో పోస్టు చేశారు. తాను సుంకాలు వేస్తానని భయ పెట్టానని.. అందుకే రెండు దేశాలు దారికి వచ్చాయని.. ఆయన అప్పట్లోనే కాదు.. తాజాగా కూడా ప్రకటించారు. ఇక, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్తాయిలో విమర్శలు గుప్పించింది.
ఆపరేషన్ సిందూర్‌ను ఎందుకు అర్ధంతరంగా ముగించారు? అసలు పహల్గాంలోకి ఉగ్రవాదులు ఎలా వచ్చారు? ఈ విషయాన్ని భారత నిఘా వర్గాలు ఎందుకు గుర్తించలేక పోయాయి? అసలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రమేయం ఏంటి? మన దేశ వ్యవహారాలపై అమెరికా పెత్తనం ఏంటి? పహల్గాం దాడికి ముందు రోజు ప్రధాని విదేశీ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని ఎందుకు వెనక్కివచ్చారు? ఇలా.. అనేక ప్రశ్నలతో కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని కార్నర్ చేసింది. దీనిపై పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశ పరచాలని కూడా డిమాండ్ చేశాయి. అయితే.. అప్పటి నుంచి మౌనంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం తాజా వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల్లోనూ 16 గంటల చొప్పున సమయం కేటాయించి.. చర్చకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తాజాగా ప్రధాని మోడీ ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. లోక్ సభలో కీలకోపన్యాసం చేశారు. ఆపరేషన్ సిందూర్‌ను ఆపేయాలని తమ ప్రభుత్వానికి ప్రపంచ దేశాలు ఏవీ చెప్పలేదని.. దీనిలో ఎవరి ప్రమేయం కూడా లేదని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాదు.. ఆపరేషన్ సిందూర్‌కు ప్రపంచ దేశాలన్నీ.. మద్దతుగా నిలిచాయన్నారు. తాము పాకిస్థాన్‌పై యుద్ధం చేయలేదన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాత్రమే దాడులు జరిపామని తేల్చి చెప్పారు. ఉగ్రవాదం విషయంలో సహించేది లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో పాకిస్థాన్‌కు సహకరించే దేశాలను కూడా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates