పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం

పవర్ స్టార్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను క్రిష్ – జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశారు. గురువారం నాడు రిలీజ్ అయిన సినిమాను ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ద్వారా ప్రదర్శించారు.

ఇక ఈ సినిమా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి ఇమేజ్ ఉన్న ఒక స్టార్ హీరో బేసిక్‌గా ఇలాంటి సనాతన ధర్మాన్ని చాటి చెప్పే సినిమాని చేయడం ఒక సాహసమే. ఆయన ఒక హీరో మాత్రమే కాదు, ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం.

ఇలాంటి సమయంలో ఆయన సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించిన తీరు గురించి అందరూ గొప్పగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు అంతకన్నా గొప్పగా సనాతన ధర్మ విశిష్టతను వచ్చే తరాల వారికి సైతం అర్థమయ్యేలా, వారిని తట్టి లేపేలా సినిమాలో పెట్టిన తీరు ఇప్పుడు అందరినీ ఈ సినిమా చూసేలా చేస్తుంది. ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ తీసుకొచ్చిన ఈ సినిమాలో ఆయన నటన గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. కోహినూర్ డైమండ్ అన్వేషణలో పవన్ కళ్యాణ్ ప్రయాణం, తదనంతర పరిస్థితులు, అప్పటి మొగలుల అరాచకాలను కళ్లకు కట్టినట్లు చాటి చెప్పాయి. ఇలాంటి సమయంలో ఈ సినిమా చేయడం పవన్ ధైర్యాన్ని చాటి చెబుతోంది.