ఏపీ ఆర్థిక ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రం: జ‌గ‌న్

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్‌.. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో సంప‌ద సృష్టిస్తామ‌ని చెప్పిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఒక్క‌రూపాయి కూడా సృష్టించ‌లేక పోయార‌ని విమ‌ర్శించారు. పైగా.. అప్పులు శ‌ర‌వేగంగా పెరుగుతున్నాయ‌న్నారు. దీనివ‌ల్ల రాష్ట్రం అప్పుల కుప్ప‌గా మారుతోంద‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇటీవ‌ల కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ (కాగ్‌) ఇచ్చిన నివేదిక‌ను వివ‌రించారు. దీనిలో పేర్కొన్న గ‌ణాంకాలు తాము చెబుతున్న‌వి కాద‌ని.. కేంద్రంలో ఏ ప్ర‌భుత్వానికి చంద్ర‌బాబు మ‌ద్ద‌తు ఇస్తున్నారో.. ఆ ప్ర‌భుత్వం నేతృత్వంలోని కాగ్ సంస్థ ఇచ్చిన‌వేన‌ని వెల్ల‌డించారు.

ప్ర‌స్తుత 2025-26 ఆర్థిక సంవ‌త్స‌రంలో రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంద‌ని కాగ్ పేర్కొన్న‌ట్టు జ‌గ‌న్ చెప్పారు. రాష్ట్రంలో ఆదాయం లేక‌పోగా.. ఆర్థిక స్థిరత్వం, నిర్వహణ కూడా సరిగా లేద‌ని కాగ్ వివ‌రించింద‌న్నారు. ప్ర‌స్తుతం అప్పుల కుప్పగా మారిపోయింద‌న్నారు. తొలి మూడు మాసాల్లో జీఎస్టీ ఆదాయం దారుణంగా ప‌డిపోయింద‌న్నారు. సేల్స్ ట్యాక్స్ స‌హా.. ఇత‌ర ప‌న్నుల ఆదాయం కూడా.. త‌మ వైసీపీ హ‌యాంతో పోల్చుకుంటే ఇప్పుడు దారుణంగా త‌గ్గిపోయాయ‌ని చెప్పారు. రాష్ట్రం ప్ర‌భుత్వ ఆదాయం 3.47 శాతం మాత్ర‌మే పెరిగింద‌న్న జ‌గ‌న్‌.. కేంద్రం నుంచి వ‌స్తున్న సొమ్ముల‌ను కూడా త‌మ ఖాతాలో వేసుకుని రాష్ట్ర ప్ర‌భుత్వం లెక్క‌లు చెబుతోంద‌న్నారు.

మ‌రోవైపు.. అప్పులు చాలా వేగంగా పెరుగుతున్నాయ‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఆర్థిక సంవ‌త్స‌రం తొలి మూడు మాసాల్లో 15 శాతం మేర‌కు అప్పులు పెరిగిపోయాయ‌న్నారు. ఇది గ‌త ఐదేళ్ల త‌మ ప్ర‌భుత్వం చేసిన అప్ప‌ట్లో స‌గంగా ఉంద‌న్నా రు. ఇది దారుణం కాదా? అని ప్ర‌శ్నించారు. పైగా ఏ ప‌నికావాల‌న్నా.. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింద‌ని విమ‌ర్శించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అవినీతిలో కూరుకుపోయార‌ని చెప్పారు. “ఆదాయం లేదు. అప్పులు పెరుగుతున్నాయి. దీనికితోడు అవినీతి కూడా పెరుగుతోంది. ఇదేనా సంప‌ద సృష్టి” అని జ‌గ‌న్ ఎద్దేవా చేశారు.

కాగా.. జ‌గ‌న్ చేసిన విమ‌ర్శ‌ల‌పై టీడీపీ కౌంట‌ర్ ఇచ్చింది. పెట్టుబ‌డులు వ‌స్తే.. రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంద‌ని చెప్పారు. కానీ, ఈ పెట్టుబ‌డులు రాకుండా.. జ‌గ‌న్ అడ్డుకుంటున్నార‌ని అన్నారు. అందుకే.. రాష్ట్రంలో పెట్టుబ‌డులు వ‌చ్చేందుకు, సంప‌ద పెరిగేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చెప్పారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది మాత్ర‌మే అయింద‌ని.. ఈ ఏడాది కాలంలో వైసీపీ చేసిన విధ్వంసాన్నిస‌రిదిద్ద‌డంతోనే స‌రిపోయింద‌ని నాయ‌కులు దుయ్య‌బ‌ట్టారు.