రాష్ట్రప్రభుత్వంతో మరో వివాదానికి స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రెడీ అయిపోయినట్లే అనుమానంగా ఉంది. ఆ ఉద్దేశ్యం లేకపోతే ఏకపక్షంగా ఎన్నికల నిర్వహణకు రెడీ అవ్వరు. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో మాట్లాడకుండా నిర్ణయం తీసుకోవద్దని సుప్రింకోర్టు చెప్పినా నిమ్మగడ్డ వినలేదు. ఫిబ్రవరిలో స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించాలని డిసైడ్ చేసినట్లు కమీషనర్ ఓ ప్రకటనలో స్పష్టం చేయటమే ఇందుకు నిదర్శనం. పైగా ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాతే షెడ్యూల్ విడుదల చేస్తానని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం కరోనా వైరస్ కారణంగా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని స్పష్టంగా చెప్పేసింది.
అంటే ఎన్నికలను నిర్వహించాలని ఏకపక్షంగా డిసైడ్ చేసిన తర్వాత కేవలం షెడ్యూల్ విషయాన్ని మాత్రమే ప్రభుత్వంతో మాట్లాడుతానని చెప్పటంలో అర్ధమేంటి ? ఈ మధ్య రాజకీయపార్టీలతో సమావేశం నిర్వహించిన విషయంలో కూడా నిమ్మగడ్డ ఏకపక్షంగానే వ్యవహరించారు. అప్పుడు కూడా అధికార వైసీపీ అభ్యంతరం పెట్టింది. అయినా పట్టించుకోలేదు. ఇఫుడు ఎన్నికల నిర్వహణను కూడా అలాగే ప్రకటించేశారు. మొన్నటి మార్చిలో జరుగుతున్న ఎన్నికలను అర్ధాంతరంగా ఏకపక్షంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ప్రభుత్వం-నిమ్మగడ్డ మధ్య అనేక వివాదాలు జరుగుతునే ఉన్నాయి.
ప్రభుత్వంతో మాట్లాడుకుని చర్చించుకుంటే పరిష్కారం అయ్యే వాటిని కూడా కమీషనర్ కోర్టులో కేసులు వేస్తున్నారు. కమీషన్ కు నిధులు కావాలంటే ప్రభుత్వం ఇవ్వటం లేదంటు గతంలో ఓ కేసు వేశారు. దానిపై కోర్టు కూడా ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. తీరా చూస్తే నిమ్మగడ్డ అడిగింది రూ. 40 లక్షలైతే ప్రభుత్వం 39.60 లక్షలను విడుదల చేసింది. అంటే ఇక మిగిలింది కేవలం 40 వేల రూపాయలు మాత్రమే. ఈ విషయాన్ని ప్రభుత్వం తరపు లాయర్ చెప్పినపుడు కోర్టు కూడా ఆశ్చర్యపోయింది.
అలాగే ప్రభుత్వం విడుదల చేసిన నిధులను నిమ్మగడ్డ విచ్చలవిడి ఖర్చులు పెడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది . ప్రభుత్వంతో సంబంధం లేకుండానే హైదరాబాద్ లో రెండో క్యాంప్ ఆఫీసును పెట్టుకుని నిధులను దుర్వినియోగం చేస్తున్నట్లు తెలుసుకున్న కోర్టు నిమ్మగడ్డను తీవ్రంగా ఆక్షేపించింది. రాబోయే ఏప్రిల్ లో రిటైర్ అయిపోతున్న నిమ్మగడ్డ ఎలాగైనా తన పదవీ కాలం ముగిసేలోగానే వాయిదాపడిన ఎన్నికలను నిర్వహించేయాలని పట్టుదలతో ఉన్నారు. ఇదే సమయంలో నిమ్మగడ్డ ఉన్నంత వరకు ఎన్నికలను జరపకూడదని ప్రభుత్వం కూడా గట్టి పట్టుదలతో ఉంది.
తాజా డెవలప్మెంట్లను చూస్తుంటే తొందరలోనే ప్రభుత్వానికి నిమ్మగడ్డకు మధ్య మరో వివాదం మొదలవ్వటం ఖాయమనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎన్నికల నిర్వహణకు గ్రేటర్ ఎన్నికలను ఉదాహరణగా చూపుతున్నారు. అయితే తెలంగాణాలో కరోనా వైరస్ తీవ్రత లేదని ప్రభుత్వం మొదటి నుండి చెబుతోంది. కాబట్టి జీహెచ్ఎంసి ఎన్నికలకు రెడీ అయిపోయింది. కానీ ఏపిలో పరిస్ధితి దీనికి భిన్నం. ఇదే విషయమై బుధవారం గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ను కలవబోతున్నారు. ఆ తర్వాతేమైనా కోర్టుకెళతారో ఏమో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates