తెలంగాణ ముఖ్యమంత్రిగా 2034 వరకు పాలమూరు బిడ్డే ఉంటాడని.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పాలమూరు నుంచి ఎన్నికైన కేసీఆర్.. ఈ గడ్డకు ఏం చేశారో చెప్పాలని బీఆర్ఎస్ అధినేతను ఆయన నిలదీశారు. కరీంనగర్ నుంచి వచ్చి.. పాలమూరు నుంచి నిలబడితే..ఇక్కడి ప్రజలు కేసీఆర్‌ను అక్కున చేర్చుకున్నారని..కానీ, ఆయన ఇక్కడి వారిని గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. పాలమూరులో శ్రీశైలం ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం చేశారా? అని ప్రశ్నించారు. వారికి కనీసం పరిహారం కూడా ఇవ్వకుండానే పదేళ్లు పాలించానని జబ్బలు చరుచుకున్నాడని వ్యాఖ్యానించారు.
పాలమూరు బిడ్డలు.. చెప్పులు కుట్టుకుని, పశువులు పెంచుకుని జీవించాలా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వాల్మీకి, బోయ కులస్థులను ఎస్టీ జాబితాలో చేర్పిస్తానని వారికి హామీ ఇచ్చి.. వారి ఓట్లతో పార్లమెంటుకు వెళ్లిన కేసీఆర్.. ఆ పని ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. పాలమూరు మీకు రాజకీయంగా భిక్ష పెడితే.. మీరు పాలమూరు బిడ్డలకు సున్నం కొట్టారని దుయ్యబట్టారు. పాలమూరు బిడ్డ వచ్చే 2034 వరకు సీఎంగానే ఉంటాడని అన్నారు. ఈ జిల్లాలో మార్పు ఖాయమని చెప్పారు. మాదిగల పిల్లలకు వైద్య విద్య సీట్లు వస్తుంటే కేసీఆర్‌కు ఏడుపు వస్తోందని ఎద్దేవా చేశారు.
“పాలమూరు వాసులు చేపలు పట్టుకోవాలి.. చెప్పులు కుట్టుకోవాలా? మీ పిల్లలు రాజ్యాలు ఏలాలా? పాలమూరు పచ్చగా మారుతుంటే ఎందుకంత విషం చిమ్ముతున్నావు?” అని కేసీఆర్‌పై సీఎం రేవంత్ నిప్పులు చెరిగారు. కేసీఆర్‌కి మద్దతిస్తున్న పాలమూరు నేతలు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డికి సిగ్గుండాలన్న ఆయన.. దమ్ముంటే.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి పాలమూరు అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’కు సీఎం రేవంత్ రెడ్డి శంకు స్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఉద్వేగంగా ప్రసంగించారు.
నీ డైరీలోనో.. నీ గుండెలపైనో..
పాలమూరు బిడ్డ 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉంటాడన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని కేసీఆర్.. తనడైరీలో అయినా.. తన గుండెలపైనైనా రాసుకోవాలని సూచించారు. పాలమూరు బిడ్డలు అమాయకులని.. అధికారం ఇస్తే.. వారిని మోసం చేశారని వ్యాఖ్యానించారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి కూడా.. కీలకమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేక పోయారని దుయ్యబట్టారు. కాళేశ్వరం కోసం లక్ష కోట్లు ఖర్చు చేసినా.. అది కూలేశ్వరం అయిందని ఎద్దేవా చేశారు. పట్టుమని ఐదేళ్లు కూడా నిలవలేదన్నారు. 2019లో కడితే.. 2023లో అది కూలిపోయిందని.. దీనికి కేసీఆర్‌ది బాధ్యత కాదా? అని నిలదీశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates