నిజాల్ని నిర్మోమాటంగా మాట్లాడినా.. తప్పు మాట్లాడినట్లుగా కామెడీ చేయటం చూస్తుంటాం. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఇదే తీరులో ఉంది. కరోనా విషయంలో ఆయన చేసిన ప్రతి వ్యాఖ్యపైనా విమర్శ వినిపిస్తోంది.
ఆయన మాటల్ని తప్పు పట్టేలా ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా కరోనా వైరస్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేక ప్రచారం ఏ స్థాయిలో జరుగుతోందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
కరోనా కూడా జ్వరం లాంటిదేనని.. వైరస్ తో మరికొంత కాలం సహజీవనం చేయాల్సి ఉంటుందన్న మాటను ట్రోల్ చేయటం చూస్తున్నదే. అయితే.. ఈ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. తాజాగా నిర్వహించిన ఒక చానల్ డిబేట్ లో ఆయన మాట్లాడుతూ.. ఏపీ సీఎం చేసిన వ్యాఖ్యల్ని సమర్థించారు.
కరోనా నిర్దారణ పరీక్షల సంఖ్య పెంచాలని.. ప్రజల్లో రోగనిరోధక శక్తి పెంచుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని.. కరోనా జ్వరం లాంటిదేనన్న వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదన్న మాజీ జేడీ.. ఇంట్లో కొడుక్కి జ్వరం వస్తే తగ్గిపోతుందిలే అంటూ తండ్రి ధైర్యం చెప్పిన రీతిలోనే జగన్ వ్యాఖ్యల్ని చూడాలన్నారు. రోగికి మానసిక బలం.. ధైర్యం చెప్పటం చాలా ముఖ్యమన్న ఆయన.. సీఎం హోదాలో భయపడాల్సిన అవసరం లేదని చెప్పటంలో తప్పేమీ లేదన్నారు.
జగన్ వ్యాఖ్యల్ని సమర్థించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.. నేతల తీరును మాత్రం తప్పు పట్టారు. ఏపీ అధికారపక్ష నేతలు ర్యాలీలు నిర్వహించటం.. సభలు పెట్టటం సరైనది కాదన్నారు. నేతలు బయటకు వచ్చి హడావుడి చేయటం వల్ల.. తాము సైతం బయటకు వస్తే ఏమవుతుందిలే అన్న భావనకు ప్రజలు వచ్చే అవకాశం ఉందన్నారు. దీనివల్ల నష్టం కలుగుతుందన్న ఆందోళనను వ్యక్తం చేశారు.
ఏపీలో పెరుగుతున్న కేసుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన.. కరోనా నిర్దారణ పరీక్షల్ని మరింత పెంచాలని వ్యాఖ్యానించారు. మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాటల్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వింటున్నారా?
Gulte Telugu Telugu Political and Movie News Updates