రండి మాట్లాడుకుందాం.. రేవంత్‌, బాబుల‌కు ఆహ్వానం!

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదాల‌కు సంబంధించి ప‌రిష్కారం చూపించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్ర‌భుత్వం రెడీ అయింది. ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఢిల్లీకి రావాల‌ని.. త‌మ స‌మ‌క్షంలోనే కూర్చుని చ‌ర్చించుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఈ నెల 16న ఢిల్లీకి వ‌చ్చేందుకు వీలు అవు తుందో లేదో చెప్పాల‌ని.. ఆ రోజు కూర్చుని మాట్లాడుకుందామ‌ని కేంద్రం పేర్కొంది. ఈ మేర‌కు రెండు తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం తాజాగా లేఖ‌లు రాసింది.

బ‌న‌క‌చ‌ర్ల‌పైనే!

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య క‌ర్నూలు జిల్లాలో సీఎం చంద్ర‌బాబు నిర్మించ త‌ల‌పెట్టిన బ‌న‌క‌చ‌ర్ల ప్రాజె క్టు వ్య‌వ‌హారం వివాదంగా మారిన విష‌యం తెలిసిందే. దీనిని ఇప్ప‌టికే కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ విభాగం అధి కారులు తొక్కిపెట్టారు. గోదావరిలో మిగులు జ‌లాలు ఎన్ని? అవి ఎలా లెక్కించారు? దీనికి సంబంధించి న అధికారిక నిర్ణ‌యం ఏంటి? అనే కీల‌క విష‌యాల‌పై కేంద్రం రాష్ట్రాన్ని ప్ర‌శ్నిస్తూ.. లేఖ కూడా రాసింది. దీనిపై ఏపీ స‌మాధానం చెప్పేందుకు సిద్ధ‌మైంది.

మ‌రోవైపు.. తెలంగాణ ప్ర‌భుత్వం బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును పూర్తిగా వ్య‌తిరేకిస్తున్న విష‌యం తెలిసిందే. దీనిని ఎట్టి ప‌రిస్థితిలోనూ నిర్మించ‌కుండా చూస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. ప్ర‌తిప‌క్షాల నుంచి రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు వ్య‌వ‌హారం ఇబ్బందు ల్లో ప‌డింది. ఈ క్ర‌మంలోనే ఏపీ నుంచి కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. బ‌న‌క‌చ‌ర్ల‌ను గేమ్ ఛేంజ‌ర్‌గా భావిస్తున్న సీఎం చంద్ర‌బాబు.. దీనికి అనుమ‌తులు ఇవ్వాల‌ని కోరుతున్నారు.

ఇదిలావుంటే.. రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు.. కృష్ణాన‌ది జ‌లాల‌ను కేటాయించారని.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాదిస్తున్నారు. దీంతో తెలంగాణ‌కు అన్యాయం జ‌రిగింద‌ని.. ఇప్పుడు తాజాగా రాష్ట్రాల వారిగా జ‌లాల ను కేటాయించాల‌ని ఆయ‌న కోరుతున్నారు. ఈ క్ర‌మంలో రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తోనూ ఉమ్మ‌డి గా కూర్చుని చ‌ర్చించి ప‌రిష్క‌రించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. అయితే.. తెలంగాణ‌లో ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యం, ఇక్క‌డ బీజేపీ బ‌లంగా ఉన్న క్ర‌మంలో కేంద్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్న‌ది ఆస‌క్తిగా మారింది.