జనసేన నాయకులు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్న అంశాలు కూడా తెలిసిందే. నిజానికి జనసేన పార్టీ అంటే నిబద్ధతకు, ప్రజా సేవకు, ప్రశ్నించే తత్వానికి కీలకమని ఆ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాను కూడా అదే విధానాన్ని అవలంబిస్తానని ఆయన అన్నారు. అయితే అనూహ్యంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు పార్టీని, పార్టీ అధినేతను కూడా ఇరుకున పడేస్తున్నాయి.
అయితే ఎప్పటికప్పుడు ఉపేక్షించకుండా ఆయన చర్యలు అయితే తీసుకుంటున్నారు. కానీ, నాయకులలో మాత్రం మార్పు పెద్దగా కనిపించడం లేదు. గతంలో పార్టీకి బలమైన వాయిస్ గా ఉండి ఎన్నికల సమయంలో జనసేన తరఫున ప్రచార గీతాలను కూడా ఆలపించినటువంటి జానీ మాస్టర్ తర్వాత కాలంలో లైంగిక వేధింపుల కేసులు ఎదుర్కొన్నారు. దీంతో అప్పటివరకు ఆయనను పార్టీ ప్రచారకర్తగా.. పార్టీ అధికార ప్రతినిధిగా నియమించిన.. పవన్ కళ్యాణ్ ఆయనను పార్టీ నుంచి తప్పించాల్సి వచ్చింది.
ఆ తర్వాత ఆయన కేసులో బైల్ పొంది బయటకు వచ్చినా జనసేన పార్టీకి దూరంగానే ఉంటున్నారు. జనసేన కూడా ఆయనను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక తర్వాత పిఠాపురంలోనే ఓ బాలికపై జనసేన కార్యకర్త ఒకరు లైంగిక దాడికి పాల్పడడం, కేసులు పెట్టడం వంటివి జరిగాయి. దీంతో అప్పుడు కూడా సదర కార్యకర్తను పార్టీకి దూరంగా ఉంచారు. ఇక తాజాగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి వినుత వ్యవహారం మరింతగా పార్టీని ఇబ్బందుల్లో వేసింది. వినుత బలమైన గళం ఉన్న నాయకురాలు. స్థానికం గా కూడా మంచి పేరు సంపాదించుకుంది.
కానీ, ఆమె వ్యక్తిగత వ్యవహారాలు వివాదాస్పదం కావడం, పార్టీ వ్యవ్యవహారాలకు సంబంధించి పనులు చేసి పెడతానని కొంతమంది సొంత పార్టీ కార్యకర్తల దగ్గర డబ్బులు వసూలు చేశారనేది వినుతి పై ఉన్న ప్రధాన ఆరోపణ. అదే సమయంలో ఇతర పార్టీ నాయకులతో కలిసి కాంట్రాక్టులు చేస్తున్నారనేది కూడా ఆమెపై ఉన్న ఆరోపణలు. ఈ క్రమంలోనే కొన్నాళ్ల కిందట ఆమెపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. అయినా తాజా పరిణామాల రీత్యా ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు.
ఇవి పైకి కనిపిస్తున్న వ్యవహారాలు మాత్రమే కాదు. ఎమ్మెల్యేలు కూడా కొంతమంది గాడి తప్పుతున్నారు. కాబట్టి ఇలాంటి పరిణామాలను జనసేన అధినేత ఒకటికి రెండుసార్లు పరిశీలించి ఇలాంటి వారిపై తగిన విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే వచ్చే నాలుగేళ్లలో పార్టీ పరిస్థితి ఇబ్బందుల్లో పడుతుందనేది పరిశీలకులు వేస్తున్న అంచనా. మరి ఏం చేస్తారనేది చూడాలి. ఇక్కడ చిత్రం ఏంటంటే పనిచేస్తామన్న నాయకుల కంటే కూడా వీరికి పార్టీలో ప్రాధాన్యం దక్కుతోందన్నది మరో ప్రధాన విమర్శ.
Gulte Telugu Telugu Political and Movie News Updates