ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రెండుకళ్లుగా ముందుకు సాగుతున్న సర్కారు… నగరాలు, పట్టణాల పరిశుభ్రతకు కూడా పెద్ద పీట వేస్తోంది. ముఖ్యంగా వైసీపీ హయాంలో పేరుకుపోయిన 8 లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేస్తున్న విషయం తెలిసిందే. దీని నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేసే వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. అదేసమయంలో చెత్త సేకరణ, పరిసరాల పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తోంది. ఈ క్రమంలో తాజాగా స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న అవార్డుల్లో తొలి మూడు వరుసల్లో ఏపీ నిలిచింది.
మొత్తం ఐదు ర్యాంకులను ఏపీ సొంతం చేసుకుంది. స్వచ్ఛతకు సంబంధించి కేంద్రం ఇచ్చే అవార్డుల్లో వివిధ కేటగిరీలలో ఏపీ ఎంపికైంది. వీటిలో విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలు ప్రఖ్యాత అవార్డులను దక్కించుకున్నాయి. విశాఖ అయితే.. ఏకంగా జాతీయ స్థాయి స్పెషల్ అవార్డును సొంతం చేసుకుంది. దీనికింద.. ప్రోత్సాహకంగా.. కోటి రూపాయల నగదు కూడా నగరానికి అందనుంది. అలాగే.. రాష్ట్ర స్థాయిలో రామండ్రి, సూపర్ లీగ్ సిటీ విభాగంలో మిగిలిన మూడు నగరా లైన తిరుపతి, గుంటూరు, విజయవాడ ఉన్నాయి.
ఎందుకు ఇచ్చారు?
నగరాల పరిశుభ్రతతో పాటు.. ప్రజారోగ్యానికి పెద్ద పీట వేయడంలో కీలక పాత్ర పోషించిన నగరాలకు కేంద్రం 2015 నుంచి ప్రోత్సాహకాలు అందిస్తోంది. అదేసమయంలో అవార్డులు కూడా ఇస్తోంది. జాతీయ, రాష్ట్రీయ స్థాయిలో నగరాలను ఎంపిక చేసేందుకు కేంద్రం ఒక ప్రతినిధి బృందాన్ని ఆయా నగరాలకు పంపించి.. రాష్ట్ర సర్కారుల నుంచికూడా నివేదికలు తెప్పించుకుని పరిశీలిస్తుంది. చెత్తసేకరణ, రహదారుల శుభ్రత, పరిసరాల పరిస్థితి, గ్రీనరీకి ఇస్తున్న ప్రాధాన్యం వంటి వాటిని అంచనా వేస్తారు. అదేసమయంలో పర్యావరణం కారణంగా ప్రజలకు అనారోగ్యాలు సోకుతున్నాయో..లేదో కూడా పరిశీలన చేస్తారు. వాటి ఆధారంగా అవార్డులను ప్రకటిస్తారు.
ఈ క్రమంలో కూటమి సర్కారు ఏడాది కాలంలోనే ఐదు అవార్డులను దక్కించుకోవడం గమనార్హం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలోని నగరాలు, పట్టణాల పరిశుభ్రతకు ప్రత్యేక స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. చెత్త నుంచి పునరుత్పాదక ఇంధన వనరులను తీయడం, చెత్త రహిత నగరాలను తీర్చిదిద్దడం. ఇంటింటికీ వెళ్లి చెత్త నిర్వహణపై అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతోపాటు.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా కూడా నగరాలను తీర్చిదిద్దుతున్నారు. దీంతో కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో ఏపీ దూసుకుపోయిందని అధికారులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates