వ్యాపారానికి హిందీ కావాలి.. నేర్చుకోవ‌డానికి వ‌ద్దా?

‘హిందీ’ భాష‌ను బ‌ల‌వంతంగా రుద్దుతున్నార‌న్న వ్యాఖ్య‌లు.. తెలంగాణ‌, క‌ర్ణాట‌క వంటి రాష్ట్రాల్లో జ‌రుగుతున్న పెద్ద పెద్ద రాజ‌కీయ వివాదాలు అంద‌రికీ తెలిసిందే. త్రిభాషా సూత్రంగా కేంద్రం ప్ర‌వేశ పెట్టిన హిందీ విష‌యం పై ప‌లు రాష్ట్రాల్లో వివాదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. మ‌హారాష్ట్రంలో బీజేపీ స‌ర్కారే ఉంది. కానీ, స్థానిక మ‌రాఠాకు పెద్ద‌పీట వేసే ప్ర‌జ‌లు ఉన్న నేప‌థ్యంలో అక్క‌డ త్రిభాషా మంత్రం ప‌ఠించ లేక పోయారు. తొలుత హిందీపై కీల‌క నిర్ణ‌యం తీసుకున్నా.. త‌ర్వాత‌.. వెన‌క్కి తీసుకోక త‌ప్పింది కాదు.

కాగా.. ఈ వ్య‌వ‌హారంపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ రియాక్ట్ అయ్యారు. వ్యాపారానికి హిందీ కావాలి.. కోట్ల‌కు కోట్ల రూపాయ‌లు సంపాయించుకునేందుకు హిందీ అవ‌స‌రం.. కానీ.. జీవితంలో నేర్చు కునేందుకు మాత్రం హిందీ అవ‌స‌రం లేదా? అని ఘాటుగా ప్ర‌శ్నించారు. హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న రాజ్య భాష విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న హిందీపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఒక భాష‌ను నేర్చుకోవ‌డం వ‌ల్ల‌.. అద‌న‌పు ప‌రిజ్ఞానం పెరుగుతుంద‌న్నారు.

ప్ర‌స్తుత ప్ర‌పంచం భాష‌ల‌తో సంబంధం లేకుండా.. ముందుకు సాగుతోంద‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఉపాధి కోసం.. విద్య కోసం.. ఖండాంత‌రాలు దాటుకుని వెళ్ల‌డం లేదా? అని ప్ర‌శ్నించారు. హిందీని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదన్నారు. అలా చేయ‌డం ద్వారా భ‌విష్య‌త్తు త‌రాలకు అభివృద్ధిని అడ్డుకుంటు న్నార‌ని వ్యాఖ్యానించారు.

‘‘హిందీలో డబ్‌ అయిన 31 శాతం సౌత్‌ ఇండియన్‌ సినిమాలు ఆదాయం తెచ్చిపెడుతున్నాయి. వ్యాపారానికి హిందీ కావాలి. నేర్చుకోవడానికి మాత్రం వ‌ద్దు“ అని విమ‌ర్శించారు. కాగా.. గ‌త నెల‌లో త‌మిళ‌నాడులో జ‌రిగిన ముర‌గ‌న్ మ‌హానాడులో పాల్గొన్న‌ప్పుడుకూడా ప‌వ‌న్ కల్యాణ్ అచ్చంగా ఇదే త‌ర‌హాలో వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.