చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలోని మామిడి మార్కెట్‌లో రెండు రోజుల కిందట విపక్ష నాయకుడిగా, మాజీ సీఎంగా వైసీపీ అధినేత జగన్ పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా అసలు కార్యక్రమం.. కొసరు హడావుడితో పక్కదారి పట్టింది. దీంతో పూర్తిస్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించకుండా అర్ధంతరంగా రైతులతో మాట్లాడి వెనుదిరిగారు. దీనివల్ల కార్యక్రమానికి సంపూర్ణత అయితే రాలేదు. ఇదే విషయం వైసీపీలోనూ చర్చకు వచ్చింది.
బంగారుపాళ్యం పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. 500 మందిని మాత్రమే వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ, ప్రభుత్వ అంచనాల ప్రకారమే 15 వేల మంది వచ్చినట్టు పోలీసులు తెలిపారు. కానీ.. వైసీపీ లెక్కల ప్రకారం 50 వేల మందికిపైగానే వచ్చారు. ఇదే సమయంలో ట్రాక్టర్లతో మామిడి కాయల ను రోడ్డుపై వెదజల్లారు. మ్యాంగో మార్కెట్‌లో కూడా.. కార్యకర్తలు దూసుకుపోయి.. హల్చల్ చేశారు. ఇవన్నీ కూడా.. అసలు కార్యక్రమంపై పెద్ద ప్రభావం చూపించాయని పార్టీ అధినేత జగన్ అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో చేపట్టిన పర్యటనలపై తాజాగా అంతర్గత సమావేశం నిర్వహించినట్టు తాడేపల్లి వర్గాల నుంచి సమాచారం వెలుగు చూసింది. సీఎం జగన్ స్వయంగా బంగారు పాళ్యం పర్యటన ఏర్పాట్లు, కార్యకర్తలను తరలించిన విధానం క్షేత్రస్థాయిలో పరిశీలించిన నాయకుల విషయంపై స్పందించారు. కార్యకర్తలను తరలించడం తప్పుకాకున్నా.. ఇలా ఇష్టానుసారంగా వ్యవహరించేలా ఎవరు ప్లాన్ చేశారని ఆయన ప్రశ్నించినట్టు తెలిసింది.
అదేవిధంగా రోడ్లపై కాయలను పోయమని ఎవరు చెప్పారు? అని కూడా సీనియర్ నాయకుడిని జగన్ ప్రశ్నించినట్టు సమాచారం. “చూసేటందుకు ఏమైనా బాగుందా?. ఎందుకు చేశారు. మనపై మరింత బురద జల్లించుకునేందుకా?.” అని జగన్ ప్రశ్నించారు. చిత్తూరు నాయకులపైన.. ముఖ్యంగా ఓ సీనియర్ నాయకుడిపైనా జగన్ సీరియస్ అయ్యారని తెలిసింది. అసలు కార్యక్రమం సక్సెస్ కాకపోవడం.. కొసరు కార్యక్రమం వివాదం కావడంపై ఆగ్రహించినట్టు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates