ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్లు తగ్గుతున్నారా? అయితే.. రెచ్చిపోవడం.. లేకపోతే తెరచాటు కావడంతో ఫైర్ బ్రాండ్ల కొరత వెంటాడుతోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా వైసీపీలో ఒకప్పుడు కొడాలి నాని, రోజా, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, అనిల్‌కుమార్‌యాదవ్ వంటి పలువురు నాయకులు ఫైర్‌బ్రాండ్లుగా చలామణి అయ్యారు. అయితే.. తర్వాత కాలంలో అధికారం కోల్పోయాక.. వారిలో దాదాపు అందరూ తెరమరుగయ్యారు.
ఇక, టీడీపీలోనూ ఒకప్పుడు ఫైర్ బ్రాండ్లు ఉన్నారు. కానీ, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు పదే పదే విచక్షణ లేకుండా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించ డంతో ప్రస్తుత ఎమ్మెల్యేల్లోని ఫైర్ బ్రాండ్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేల్లోని ఫైర్ బ్రాండ్లు వెనక్కి తగ్గారు. ఒకరకంగా చెప్పాలంటే.. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లోని వారే ఒకరిద్దరు చేస్తున్న వ్యాఖ్యలు ఫైర్ బ్రాండ్ రాజకీయాలకు కేరాఫ్‌గా మారింది.
ఇదిలావుంటే.. ఫైర్ బ్రాండ్ల అవసరం రాజకీయాలకు లేదా? అంటే.. ఉంది. అయితే.. వ్యక్తిగత విమర్శలు, ఇళ్లలోని మహిళలను టార్గెట్ చేసుకుని చేసిన వ్యాఖ్యలు, బూతులు, దూషణలతోనే ఫైర్ బ్రాండ్లుగా ఎదగాలని భావించడంతోనే ఫైర్ బ్రాండ్లపై ఒకింత సమాజంలో చులకన భావం ఏర్పడింది. ఒకప్పుడు బలమైన వాయిస్ వినిపించడం.. కౌంటర్‌కు రివర్స్ కౌంటర్ ఇవ్వడం.. సబ్జక్టులపై అవగాహన ఉండి.. బలమైన గళం వినిపించేవారిని ఫైర్ బ్రాండ్లుగా పేర్కొనే వారు.
కానీ.. వైసీపీ వచ్చాకే ఫైర్ బ్రాండ్లకు అర్ధం మారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఫైర్ బ్రాండ్ అంటే.. బూతు లు, దూషణలు మాట్లాడేవారన్న కొత్త అర్థం పుట్టుకువచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి మారి.. కొత్తగా ఫైర్ బ్రాండ్లు అవసరం అన్ని పార్టీలకూ ఏర్పడింది. అయితే.. వారికి శిక్షణ ఇప్పించి.. బలమైన వాయిస్ వినిపించేలా చేసే దిశగా టీడీపీ అడుగులు వేస్తోంది. పదునైన వ్యాఖ్యలు.. సబ్జెక్టుపై పట్టు ఉన్నవారి కోసం.. దూకుడుగా వ్యవహరించే వారి కోసం పార్టీ అన్వేషణ చేస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates