ఏపీలో కూటమి ప్రభుత్వం ‘సూపర్ 6’ పథకాల అమలుకు పదును పెంచుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కీలకమైన మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి సంబంధించి అధికారులు కసరత్తు పూర్తి చేశారు. వచ్చే ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయనున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు సహా మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి మహిళల జీవితాల్లో కొత్త మార్పు వస్తుందని చెబుతున్నారు.
ఇక, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణానికి సంబంధించి కొన్ని నిబంధనలను రెడీ చేసింది. అధికారికంగా ఇవి ప్రకటించాల్సి ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు .. రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంటుందన్న చర్చకు ఈ నిబంధనలు చెక్ పెట్టాయి. అదేసమయంలో ఏయే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం లభిస్తుందన్న విషయంపైనా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ నియమాల ప్రకారమే ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు జరుగుతుందని తెలిపింది.
ఇదేసమయంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్న నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థపై ఆధారపడిన ఆటో, ట్యాక్సీ, ఊబర్, ర్యాపిడో వంటివాటికి కూడా ఉపశమనం కల్పిస్తూ.. నిర్ణయాలు తీసుకున్నారు. లైనెస్సు ఉండి సొంత ఆటోలేని డ్రైవర్లకు నెల నెలా ఆర్థిక సాయం చేయనున్నారు. అలానే ట్యాక్సీ డ్రైవర్లకు కూడా నెల నెలా కొంత మొత్తం వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇక, ర్యాపిడో, ఊబర్ వంటివాహనాలు నడుపుతూ.. వాటిపైనే ఆధారపడిన వారికి కూడా కొంత మొత్తం ఇస్తారు.
ఇక, ఆర్టీసీ నిబంధనలు ఇవీ..
- ఒక జిల్లా పరిధిలో మహిళలు ఉచితంగా ఎక్కడి నుంచిఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు.
- సదరు మహిళ జన్మించిన లేదా.. ఉద్యోగం, నివాసం ఉంటున్న జిల్లానుప్రామాణికంగా తీసుకుంటారు.
- ఆధార్‌లో పేర్కొన్న అడ్రస్, జిల్లా ప్రకారం.. ఆర్టీసీ బస్సును వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
- ఆర్టీసీలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులను మాత్రమే అనుమతించనున్నారు.
- డీలక్స్, ఇంద్ర, ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates